Jana nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుందని, బోర్డు దీనికి ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతేకాకుండా, పలు సవరణలు మరియు కట్స్‌తో కూడిన ఒక సెన్సార్ సర్టిఫికెట్ కాపీ కూడా సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ కావడంతో జూలై 23న సినిమా విడుదల కాబోతుందనే వార్తలు జోరుగా వినిపించాయి.
అయితే ఈ పరిణామాలపై ఎట్టకేలకు స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ అసలు నిజాలను వెల్లడిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించిన మాట నిజమేనని, అయితే వారు సినిమాను చూసి కొన్ని మార్పులు సూచించారని పేర్కొంది. బోర్డు ఆదేశాల ప్రకారం తాము ప్రస్తుతం ఆ మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నామని, ఆ పనులు పూర్తి కాగానే తిరిగి రీ-సెన్సార్ కోసం బోర్డుకు పంపుతామని స్పష్టం చేసింది. ఈ సాంకేతిక పనులన్నీ చాలా త్వరలోనే పూర్తవుతాయని, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనే నమ్మకం తమకు ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. నెటిజన్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని కోరింది.