Money Laundering | రూ. 215 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమని ఆమె ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు విన్నవించడంతో ఈ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. శుక్రవారం నాడు జరిగిన కోర్టు విచారణ సందర్భంగా జాక్వెలిన్ తరపు న్యాయవాదులు ఈ ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచారు. ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు, దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు ఆమె అంగీకరించారు. అప్రూవర్‌గా మారడం ద్వారా ఈ కేసులో ఆమెకు శిక్ష నుంచి మినహాయింపు లేదా కొంత ఊరట లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇక నటి అభ్యర్థనపై స్పందించిన కోర్టు, దీనిపై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. ముందుగా జాక్వెలిన్ తన అభ్యర్థనను దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి అధికారికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాతే, ఆమెను అప్రూవర్‌గా అంగీకరించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. దీనిపై స్పందన తెలియజేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సుకేశ్ ద్వారా జాక్వెలిన్ మరియు ఆమె కుటుంబ సభ్యులు సుమారు రూ. 10 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులు పొందారని ఈడీ ఇప్పటికే అభియోగాలు మోపింది. గతంలో ఈ కేసును కొట్టివేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, ఇప్పుడు అప్రూవర్‌గా మారి సుకేశ్ రహస్యాలను బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.