Mahesh Babu | దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం SSMB29 పై గ్లోబల్‌గా ఆసక్తి నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దాకా వెళ్లిన రాజమౌళి, ఈసారి దానిని మించి సినిమా తెరకెక్కిస్తున్నాడు. అడవుల నేపథ్యంలో ఒక ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం సౌతాఫ్రికా అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
ఈ చిత్రానికి సంబంధించి అధికారిక అప్డేట్స్ ఇంకా రాకపోయినప్పటికీ, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మహేశ్‌బాబు పుట్టినరోజు (ఆగస్ట్ 9)ను టార్గెట్ చేస్తూ, రాజమౌళి ఓ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘#GlobeTrotter’ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఫోటో విడుదల చేసి, నవంబర్‌లో ప్రీ-లుక్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా షెడ్యూల్‌కు ముందు, మేకర్స్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక చెరువు సమీపంలో భారీ ఓపెన్ సెటప్‌ను వేయించారు. కానీ అక్కడికి మహేశ్‌బాబు వచ్చిన తర్వాత కేవలం అరగంట ఉండగానే, ‘‘ఇక్కడ చాలా వేడిగా ఉంది, నేను షూటింగ్ చేయలేను’’ అని వెళ్లిపోయారని టాక్. దాంతో ఆ సెట్ వృథా అయి, నిర్మాతలకు రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు సమాచారం.
మహేశ్‌బాబు చాలా సెన్సిటివ్ నేచర్ కలిగిన వ్యక్తి. కాస్త ఎక్కువ కారం తిన్నా, ఎండలో కొంతసేపు ఉన్నా తట్టుకోలేరట. గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ సమయంలోనూ ఇలానే ఓ ఔట్‌డోర్ సెట్లో షూటింగ్ ఆయన తిరస్కరించగా, ఆ లొకేషన్‌ను ఇన్డోర్ సెటుగా మార్చి షూట్ చేశారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితి SSMB29 విషయంలోనూ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మరియు ఇతర కీలక పాత్రధారులపై సౌతాఫ్రికాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదే ప్రధాన షెడ్యూల్ అని భావిస్తున్నారు. ఈ మూవీ విజువల్ గ్రాండియర్ గా ప్రేక్షకులకి థ్రిల్ అందిస్తుంది.