అగ్ర హీరో మహేశ్‌బాబు ప్రస్తుతం తన 29వ సినిమా ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
మహేష్‌బాబు-సందీప్‌రెడ్డి వంగా కాంబో ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే హిందీలో సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ పూర్తిచేసిన తర్వాతే మహేశ్‌బాబుతో చేసే సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చారు. కొంత సమయం పట్టినప్పటికీ వారిద్దరి కాంబినేషన్లో సినిమా మాత్రం పక్కా అన్నట్లు మాట్లాడారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు ప్రతిష్టాత్మక 30వ సినిమా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోనే తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.