Mahavtar Narishimha | ఎలాంటి హైప్ లేకుండా, పెద్దగా ప్రమోషన్లు చేయకుండా సైలెంట్‌గా విడుదలైన “మహావతార్ నరసింహ” సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలెట్టింది.మొదటి రోజునే విజువల్ గ్రాండియర్, హై క్వాలిటీ యానిమేషన్, కిక్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సన్నివేశాలు, క్రౌడ్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసిన పౌరాణిక కథనంతో ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధిస్తోంది. కేవలం 10 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు రూ.300 కోట్ల క్లబ్లో చేరిపోయింది.
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమా గా ఇది ఒక మైలురాయిని చేరుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించగా ఓవర్సీస్లో రూ.26 కోట్లు, ఇండియాలో రూ.276 కోట్లు రాబట్టింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న “మహావతార్ సినిమాటిక్ యూనివర్స్” లో ఇది మొదటి చిత్రం మాత్రమే. మొత్తం 10 విష్ణు అవతారాల ఆధారంగా ఏడు సినిమాలు రూపొందించబోతున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సినిమా విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రెండో భాగం “మహావతార్: పరశురామ్” 2027లో విడుదల కానుంది.
దర్శకుడు అశ్విన్‌కుమార్ వెల్లడించిన ప్రకారం, ఇది మరింత పవర్ ఫుల్‌గా భావోద్వేగభరితంగా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండనుంది. మహావతార్ నరసింహ సినిమా సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించబడగా, కథనంలో కూడా అంతే బలం ఉండడంతో సినిమా సూపర్ హిట్ అయింది. విజువల్స్, మ్యూజిక్, పాత్రల డిజైన్, పౌరాణికత ప్రతిదీ ప్రేక్షకులను తడిసిముద్దయ్యేలా చేస్తుంది. ఇది కేవలం యానిమేటెడ్ సినిమా కాదు, భారతీయ మైథాలజీపై ఆధారపడిన భావోద్వేగ పయనం అని చెప్పాలి.ఈ సినిమాను రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు చెప్పారు కానీ అసలు బడ్జెట్ రూ. 40 కోట్లు. మార్కెటింగ్ కూడా కలుపుకుంటే 40 కోట్లకి చేరింది. లాభాలు మాత్రం సినిమాకి భారీగానే వచ్చాయని చెప్పాలి.