Mahavatar Narsimha | ఒక సినిమా విజయం సాధించాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, రొంటిక్ సీన్లు, ఐటెం పాటలు అవసరం లేదని ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ చిత్రంతో రుజువైంది. స్టార్ కాస్టింగ్ లేని ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.. రొటీన్ కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, కథకే ప్రధానంగా నిలిచిన ఈ చిత్రం భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, కాంతార, సలార్ ఫేమ్) మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం, జూలై 25న దేశవ్యాప్తంగా పరిమిత థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది.
దేవతల – రాక్షసుల మధ్య మహా సంగ్రామాన్ని ఆధారంగా తీసుకొని, ప్రహ్లాదుని చరిత్ర, హిరణ్యకశిపుడితో విష్ణువు రూపమైన నరసింహుడు పోరాటం వంటి పౌరాణిక అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు. ₹15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు ₹1.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ మౌత్ టాక్ బలంగా ఉండటంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి.10 రోజులకు గాను ₹105 కోట్లు వసూలు చేసి భారత చరిత్రలో అత్యధికంగా వసూలు చేసిన యానిమేటెడ్ సినిమాగా నిలిచింది. ‘మహావతార్ నరసింహ’ విజయం ద్వారా మరోపక్క పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
హిందూ సంస్థలు, స్వామీజీలు కూడా ఈ చిత్రాన్ని స్వయంగా ప్రమోట్ చేయడమే కాక, ప్రత్యేక ప్రదర్శనలకు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో 200 మంది స్వామీజీలు కలిసి ఓ థియేటర్లో ఈ సినిమా ప్రత్యేకంగా వీక్షించడం, ఈ చిత్రం ప్రాచుర్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ఈ విజయం ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’పై భారీ అంచనాలను నెలకొల్పుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పౌరాణిక కథల ఆధారంగా యానిమేషన్ సినిమాలు వెలుగు చూడబోతున్నాయి. రానున్న రోజులలో మరిన్ని భారతీయ యానిమేషన్ సినిమాలకు దారి తీసే మార్గదర్శక చిత్రంగా మహవతార్ నరసింహ నిలవబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.