నటి మధుశాలిని సమర్పణలో రూపొందిన చిత్రం ‘కన్యాకుమారి’. గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రధారులు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 27న వినాయకచవితి కానుకగా చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మధుశాలిని మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్ బావుంది. నటి గీత్ నైని అందంగా కనిపించారు. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత అమ్మ ఉన్నత విద్యల్ని అభ్యసించింది.
అమ్మానాన్న ఒకరినొకరు చాలా సపోర్ట్ చేసుకునేవారు. ఈ సినిమా చూశాక, మా అమ్మానాన్న లవ్‌స్టోరీ కూడా ఇలాగే మొదలైవుంటుంది అనిపించింది. దర్శకుడు సృజన పాషన్‌తో సినిమా చేశారు. ఈ మంచి సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి.’ అని అన్నారు. కన్యాకుమారి లాంటి పాత్ర చేయడం ఆనందంగా ఉందని, ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే యూనిక్ ప్రేమకథ అనీ, వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసనంత స్వచ్ఛంగా ఈ సినిమా ఉంటుందని కథానాయిక గీత్ నైని పేర్కొన్నారు.
పొలం గట్లమీద పుట్టిన అడవి పువ్వు లాంటి సినిమా ఇదని, కవితాత్మకమైన ఊహనుంచి ఈ కథ పుట్టిందని, శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రియల్ ఎమోషన్స్ ఉంటాయని దర్శక,నిర్మాత సృజన్ తెలిపారు. ఇంకా ప్రవీణ్, సంగీత దర్శకుడు రవి, ఎడిటర్ నరేష్, సహ నిర్మాతలు అప్పలనాయుడు, సతీష్‌రెడ్డి కూడా మాట్లాడారు.