Madhavan | నీట్ పేపర్ లీక్ వివాదంపై ఎట్టకేలకు ప్రముఖ నటుడు, ఎఫ్టీఐఐ (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన మౌనం తీవ్ర చర్చకు దారితీయగా, పూణేలోని ఎఫ్టీఐఐ క్యాంపస్‌లో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన కార్యాలయ ద్వారంపై పోస్టర్లు అంటించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల అనంతరం మాధవన్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన తన సందేశంలో, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆందోళనను తాను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానని మాధవన్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేలా ఉండాలని, కానీ పేపర్ లీక్‌లాంటి ఘటనలు కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని మాధవన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కఠిన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థుల ధైర్యాన్ని మాధవన్ అభినందించారు. అయితే, ఈ ఉద్యమాన్ని కొందరు రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తమ అసలు లక్ష్యం నుంచి దారి తప్పకూడదని సూచించారు.
నీట్ వివాదంపై మాధవన్ స్పందించకపోవడంపై ఎఫ్టీఐఐ విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం వద్ద ‘గాయబ్’ పోస్టర్లు, ‘నీట్ ఫర్ సేల్’ వంటి నినాదాలతో నిరసనలు చేపట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవన్‌పై స్పందించాలనే ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉంటే, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతుండగా, పలువురు సినీ ప్రముఖులు కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవన్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.