బ్లాక్ బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్కేర్’ సినిమా వస్తున్నది అనగానే సినిమాపై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవలే విడుదలైన టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకున్నది. ఈ టీజర్లో సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. అలాగే.. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు కూడా జన బాహుళ్యంలో బాగా వినిపిస్తున్నాయి. తాజాగా మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘వచ్చార్రోయ్..’ అంటూ సాగే ఈ పాటను కె.వి.అనుదీప్ రాయగా, భీమ్స్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ‘ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్.. రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు.. మ్యాడ్ మ్యాక్స్’ వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా ఈ పాట సాగింది.
ప్రధాన పాత్రధారులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం ఈ పాటలో ఓ రేంజ్లో అల్లరి చేశారు. ఆసక్తికరమైన కథనంతో కడుపు చెక్కలు చేసి హాస్య సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుందని దర్శకుడు కల్యాణ్‌శంకర్ చెబుతున్నారు. ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి.అనుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ ప్రత్యేకగీతంలో సందడి చేశారు. ఈ నెల 28న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్ ఐఎస్సీ, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ, నిర్మాత: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్ అండ్ ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్.