Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద తన విజయ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తోంది. విడుదలై పది రోజులు పూర్తవుతున్నా ఈ సినిమా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సెకండ్ వీకెండ్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఆదివారం భారీ వసూళ్లు నమోదు చేసింది. ఈ క్రమంలో అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమా లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో ఏకంగా రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారతదేశంలో మొత్తం రూ.48.25 కోట్ల నెట్, రూ.55.86 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతమైన స్పందన లభించింది.
ఆదివారం ఒక్కరోజే భారతదేశంలో రూ.5.30 కోట్ల నెట్, రూ.6.14 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. విదేశాల్లో కూడా ఆదివారం మంచి వసూళ్లు నమోదు కావడంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ రూ.22.85 కోట్లకు చేరుకుంది. తెలుగు వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. మొత్తం మీద తెలుగు వెర్షన్ 46.94 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా, తమిళ వెర్షన్ 40.21 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఆదివారం రోజు రాష్ట్రాల వారీగా చూస్తే ..తెలుగు రాష్ట్రాలలో రూ.4.50 కోట్లు, కర్ణాటక రూ.1.10 కోట్లు, తమిళనాడులో రూ.41 లక్షలు, ఇతర ప్రాంతాలలో రూ.12 లక్షలు.. ఈ సంఖ్యలు సినిమా రెండో వారంలో కూడా బలమైన హోల్డ్‌ను కొనసాగిస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు నాలుగు రెట్లకు పైగా వసూళ్లు సాధించింది. సమంత కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడేళ్ల తర్వాత సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆమెకు ఘన విజయాన్ని అందించింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 10 రోజుల కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్ గ్రాస్ – రూ.78.71 కోట్లు,ఇండియా గ్రాస్ – రూ.55.86 కోట్లు, ఇండియా నెట్ – రూ.48.25 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్ – రూ.22.85 కోట్లు, ఆదివారం ఇండియా గ్రాస్ – రూ.6.14 కోట్లు, ఆదివారం ఇండియా నెట్ – రూ.5.30 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కూడా అదే జోష్ కొనసాగిస్తున్న ‘మా ఇంటి బంగారం’ రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.