Lokesh kanagaraj | రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కూలీ, భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్ కాగా, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం, ‘లియో’ కంటే కూడా వీక్ మూవీగా ‘కూలీ’ నిలిచింది. సినిమాకు సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కంటెంట్ లోపించడం వల్ల సినిమాలో లోకేశ్ మార్క్ కనిపించలేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘కూలీ’ చూసిన అనేక మంది అభిమానులు, నెటిజన్లు “ఇది నిజంగానే లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించిన సినిమానా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్లిన లోకేశ్‌కు, ఈ సినిమా మొదటి పెద్ద ఫ్లాప్ అయ్యిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
‘కూలీ’ విడుదలకు ముందు ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయాలనే ఆసక్తి చూపించారు. ప్రభాస్‌తో ‘ఖైదీ 2’ తర్వాత సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే, ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఓ సినిమా చేయనున్నట్టు టాక్ వినిపించింది. కానీ ‘కూలీ’ ఫలితం వెలుగు చూడగానే ఈ ప్రాజెక్టులపై సస్పెన్స్ నెలకొంది. ఫామ్‌లో లేని దర్శకుడితో సినిమాలు చేసి రిస్క్ చేయకూడదనే ఆలోచనతో ఇద్దరూ వెనకడుగు వేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఫలితాలతో సంబంధం లేకుండా లోకేశ్ కనగరాజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఖైదీ 2’ ను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. కార్తీ హీరోగా రూపొందే ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలున్నాయి. కానీ ‘కూలీ’ ఫలితంతో అది ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.
ఇటీవలి కాలంలో తెలుగు హీరోలకు తమిళ డైరెక్టర్లతో చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి. రామ్ చరణ్ – శంకర్ (‘గేమ్ ఛేంజర్’) , మహేష్ బాబు – మురుగదాస్ (‘స్పైడర్’), రామ్ పోతినేని- లింగుస్వామి (‘ది వారియర్’), నాగచైతన్య- వెంకట్ ప్రభు (‘కస్టడీ’) చిత్రాలు ఎలాంటి ఫలితాలు అందించాయో మనం చూసాం. ఇప్పుడు ఈ ట్రెండ్‌ను చూస్తే లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసిన అలాంటి ఫలితమే వస్తుందని కొందరు జోస్యాలు చెబుతున్నారు. ‘ఖైదీ 2’తో ఆయన మళ్లీ ట్రాక్‌లోకి వస్తారని, ఆయన సత్తా ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.