Liger Theatrical Rights | ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం తన నటనకు జోహార్లు కొట్టేలా చేసాడు విజయ్ దేవరకొండ. సినీరంగంలో హీరోగా ఎంట్రీ అనేది చాలా కష్టం. ఇక హీరోగా అవకాశం వచ్చినా అది నిలబెట్టుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమనే ఆయుధంగా వాడుకొని విజయ్ టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన’లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగ బిజినెస్ జరిగిందని సమాచారం.
లైగర్ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు కలిపి దాదాపు 70కోట్ల వరకు అమ్ముడయ్యాయని సమాచారం. టైర్ 2 హీరోకి ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే విశేషం అనే చెప్పాలి. విజయ్ నటించిన గతం చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మేర బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే వరల్డ్ వైడ్‌గా లైగర్ చిత్రానికి 100కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందనడంలో ఆశ్చర్యమే లేదు. ఇక నైజాంతో పాటు, ఆంధ్ర, సీడెడ్ హక్కులు వరంగల్ శ్రీను ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేశాడట. ఇటీవలే విడుదలైన ఆచార్య చిత్రాన్ని కూడా నైజాంలో వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడు.
ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.