భారతీయ సినీగీతానికి సరిగమలతో సొగబులద్దిన గాన సరస్వతీ అవతారాన్ని చాలించింది. దశాబ్దాలపాటు తన గాన మాధుర్యంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఆ గొంతు మూగబోయింది. అఖిలభారతావనిని ఓలలాడించిన ఆ అద్భుత గానం ఇక మనకు వినిపించదు. అవును.. 20కి పైగా భాషల్లో వేలాది పాటలు పాడిన సినీసంగీత సామ్రాజ్ఞి ఆశాభోంస్లే కన్నుమూశారు.
92 ఏండ్ల ఆశా భోంస్లే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడంతో ఆమెను శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే మీడియాకు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఆశా భోంస్లేకు అమరగాయని, భారతరత్న లతామంగేష్కర్ స్వయానా అక్క. అలాగే ఉమా, మీనా అనే సోదరీమణులు, హృదయనాథ్ అనే సోదరుడు కూడా ఉన్నారు. 9ఏండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆశా.. తన అక్క లతా మంగేష్కర్తో కలిసి సంగీత కచేరీల్లో పాల్గొని క్లాసికల్, గజల్స్, రొమాంటిక్ పాటలు అలవోకగా పాడేవారు. అలా అక్క లతా దీదీ దారే తన దారీ అయ్యింది.
‘పాలు నీళ్లు’ చిత్రంలోని ‘ఇది మౌనగీతం..’ సాంగ్ తెలుగులో ఆశా భోంస్లే పాడిన తొలిపాట. ఆ పాట చాలా పెద్ద హిట్. అలాగే జంధ్యాల ‘చిన్నికృష్ణుడు’ చిత్రంలో ‘జీవితం.. సప్తసాగర గీతం.. వెలుగు నీడల వేదం’ పాటకైతే నేటికీ అభిమానులున్నారు. వేటూరి సాహిత్యం, ఆశా భోంస్లే గానం, ఆర్డీ బర్మన్ సంగీతం ఈ పాటను చిరంజీవిని చేశాయి. అలాగే బాలకృష్ణ ‘అశ్వమేధం’లోని ‘సీతాకాలం ప్రేమకు ఎండాకాలం..’ వెంకటేశ్ ‘పవిత్రబంధం’లోని ‘ఐసాలకిడీ అమ్మమ్మో ఏం వేడీ..’, కృష్ణవంశీ ‘చందమామ’ చిత్రంలోని ‘నాలో ఊహలకు.. నాలో ఊసులకు..’.. ఇలా తెలుగులో ఆమె పాడిన పాటలన్నీ శ్రోతల్ని మెప్పించాయి.
బాలీవుడ్లో ఫిమేల్ సింగర్స్ అంటే ఎక్కువగా వినిపించే పేర్లు లతామంగేష్కర్, అశా భోంస్లే. అగ్ర కథానాయికలకు పాడితే లతా దీదీ పాడాలి. లేకపోతే ఆశా తాయ్ పాడాలి. అంతగా తమ గానంతో శ్రోతల్ని ఆకట్టుకున్నారు ఈ సోదరీమణులు. ఆశా భోంస్లే కెరీర్ మొదలుపెట్టిన సమయంలో లతాజీ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ కారణంగా ఆశాభోంస్లే గాత్రాన్ని లతా మంగేష్కర్తో పోల్చి చూసేవారు. అక్క నీడ నుంచి బయట పడి, తనకు తాను ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఆశా భోంస్లే ఎంతో కష్టపడ్డారు.
లతా, ఆశా అక్కాచెల్లెళ్లే అయినా.. వారిద్దరికీ వ్యక్తిగతంగా పెద్దగా పడేది కాదు. లతామంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావు భోంస్లేని పెళ్లాడాలనుకున్న ఆశా నిర్ణయాన్ని లతా మంగేష్కర్తో పాటు కుటుంబ సభ్యులంతా నిరాకరించారు. కానీ అందరి మాటనూ కాదని గణపతిరావుని పెళ్లాడటంతో, అక్కాచెళ్లెల్లిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. అయినా 1960 నుంచి చనిపోయేంతవరకూ సౌత్ ముంబై గోపాల్రావ్ దేశ్‌ముఖ్ మార్గ్‌లోని ప్రభుకుంజ్లో ఇద్దరూ ఎదురెదురు ఇండ్లలోనే నివసించేవారు. మాటలు లేకపోయినా కలిసి చాలా పాటలే పాడారు. వీరిద్దరి వైరమే ప్రధాన ఇతివృత
హిందీలో ‘సాజ్’ సినిమా రూపొందింది. అందులో ఆశా భోంస్లేగా షబ్నా ఆజ్మీ నటించగా, అరుణా ఇరానీ లతా మంగేష్కర్ పాత్ర పోషించారు. ‘పాట అనేది గొంతులో నుంచి కాదు.. అది ఆత్మ నుంచి రావాలి’ అనేవారు ఆశా భోంస్లే. ఆమె మహాగాయని మాత్రమే కాదు. గొప్ప తత్వవేత్త. కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఆమెది. అది ఆమె పాటలో ప్రతిధ్వనించేది. గాయనిగా ఆమె సృష్టించిన చరిత్ర భావితరాలకు ఓ పాఠ్యాంశం. భౌతికంగా లేకపోయినా.. పాటగా ఆశా తాయ్ ఎప్పుడూ చిరంజీవే.
ఆశా భోంస్లే మరణంపై దేశ రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలియజేశారు. ఆశా జీవితం స్ఫూర్తిదాయకమని ఆమె పాటలు శ్రోతల హృదయాల్లో శాశ్వతమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెం గాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠా క్రే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తదితరులు సంతా పం తెలియజేసిన వారిలో ఉన్నారు.
1947లో ‘జాన్ పెహచాన్’ చిత్రం కోసం పాట పాడేందుకు ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళ్లారు అశా భోంస్లే. ఆమెతోపాటు కిశోర్‌కుమార్ కూడా ఉన్నారు. అప్పటికి ఆయన కూడా ఔత్సాహికుడే. ఇద్దరినీ అర్థరాత్రి వరకూ కూర్చోబెట్టి చివరికి అవకాశం ఇవ్వకుండా పంపించారు. ఈ ఘటన ఆశాలో కసి పెంచింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓపీ నయ్యర్ స్వరాలందించిన ‘నయా దౌర్’, శంకర్-గణేశ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘బూట్ పాలిష్’ చిత్రాలు అశాని స్టార్‌ని చేశాయి. ఆశా భోంస్లే గొంతులోని గమ్మత్తైన ఒణుకు పాటకే అందాన్ని తెచ్చేది. అది క్లాసికల్ అయినా.. క్యాబరే సాంగ్ అయినా ఆశా భోంస్లే పాడిందంటే హిట్ అయి తీరాల్సిందే. దానికి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లోని ‘జరాసా జూమ్ లూన్ మే..’ సాంగ్ ఓ ఉదాహరణ. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కకు మించిన పాటలున్నాయి ఆమె ఖాతాలో.

ఒక్క భారతరత్న మినహా ఆశా భోంస్లే అందుకోని పురస్కారం లేదు. 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఆమెకు 2008లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అత్యధిక పాటలను రికార్డ్ చేసిన గాయకురాలిగా ఆమె పేరు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. 1981లో ‘ఉమ్రాన్ జాన్’ సినిమాలోని ‘దిల్ చీజ్ క్యా హై’ పాటకూ, 1986లో ‘ఇజాజత్’ సినిమాలోని ‘మేరా కుచ్ సామాన్’ పాటకూ ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు ఆశా భోంస్లే.
అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘మహారాష్ట్ర భూషణ్’, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే ‘బంగ విభూషణ్’ అవార్డులను కూడా ఆశా భోంస్లే అందుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారాలైతే లెక్కేలేదు. అంతర్జాతీయ స్థాయిలో గ్రామీ నామినేషన్స్ అందుకున్న తొలి భారతీయ మహిళ కూడా ఆశా భోంస్లేనే. బాయ్ జార్జ్ వంటి అంతర్జాతీయ గాయకులతో కలిసి ఆమె పాటలు పాడారు. దుబాయ్‌లో ‘సింగర్ ఆఫ్ ది మిలీనియం’ అవార్డును కూడా అందుకున్నారు.
భారతీయ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయింది.. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు తన గానంతో కోట్లమందిని అలరించిన పద్మ విభూషణ్ ఆశా భోంస్లే మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు. ఒక తత్వవేత్త. భారతీయ చిత్రపరిశ్రమలో ఆమెది ఒక శకం. ఆమె పాడిన పాటలు భావితరాలకు సంగీత పాఠాలుగా నిలిచిపోతాయి. తెలుగులోనూ ఆమె పాడిన మధుర గీతాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి. ఆశా భోంస్లే మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
ఆశాభోంస్లే గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకం. ప్రతి పాటకూ గ్రేస్ తీసుకొచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తా. భారతీయ సినిమా భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.
– చిరంజీవి
లక్షలాది హృదయాలను తాకిన మధుర స్వరం ఆశా భోంస్లేది. దశాబ్దాలపాటు భారతీయ సినీసంగీతానికి ప్రాణంగా నిలిచారామె. తరతరాలు నిలిచిపోయే జ్ఞాపకాలను అందించి వెళ్లిపోయారు.
– ఎన్టీఆర్
ఆశా భోంస్లే మరణం కలచివేసింది. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది..
-అల్లు అర్జున్
ఆశాజీ పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి
– నారా రోహిత్