Jayam ravi | స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సృష్టించిన క్రేజీ ఫ్రాంచైజీ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లోకి మరో ప్రముఖ నటుడు అధికారికంగా అడుగుపెట్టారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బెంజ్’ చిత్రంలోకి తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) చేరారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ చిత్ర సెట్స్ నుండి కొన్ని ఫోటోలను పంచుకున్నారు. వెల్కమ్ టు ది యూనివర్స్ రవి మోహన్ సార్ అంటూ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను లోకేశ్ కనగరాజ్ తన సొంత బ్యానర్ ‘జీ స్క్వాడ్’ (G Squad) పై ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలతో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ స్వయంగా కథను అందించడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాల తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో వస్తున్న నాల్గవ చిత్రంగా ‘బెంజ్’ నిలవనుంది. అయితే లోకేశ్ దర్శకత్వం వహించకుండా కేవలం కథ అందించి నిర్మిస్తున్న మొదటి ఎల్సీయూ చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ ‘ట్విన్ ఫిష్ వాల్టర్’ అనే అత్యంత శక్తివంతమైన క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండగా, సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి మోహన్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎల్సీయూ లవర్స్‌కు సరికొత్త యాక్షన్ అనుభూతిని పంచనుంది.