Kushi Movie First Single | ‘లైగర్’ విజయ్ను ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. యునానిమస్‌గా ఈ సినిమా తిరస్కారానికి గురి కావడంతో విజయ్ సైతం సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుంచే పలు అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. హేషమ్ అబ్దుల్ స్వర పరిచిన ఈ పాట కొత్తగా, క్యాచీగా ఉంది. అంతే బ్యూటిఫుల్‌గా హేషమ్ ఈ పాటను స్వయంగా ఆలపించాడు. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించడం విశేషం. ముస్లింగా సమంత ఆకట్టుకుంటుంది. ఇక కాశ్మీర్ అందాలను కూడా ఈ పాటలో చూపించారు.
కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుంది. నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.