Hera Pheri 3 | బాలీవుడ్ కల్ట్ కామెడీ ఫ్రాంచైజీ ‘హేరా ఫేరీ 3’ చుట్టూ వివాదాలు రోజురోజుకూ ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి నటుడు పరేష్ రావల్ అకస్మాత్తుగా తప్పుకోవడంపై దర్శకుడు ప్రియదర్శన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరేష్ తప్పుకోవడంతో స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందారని, కంటతడి పెట్టుకుని “ప్రియన్, పరేష్ మాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు?” అని అడిగారని ప్రియదర్శన్ వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ, పరేష్ రావల్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తమకెవరికీ తెలియదని, మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “పరేష్ మాకు ఫోన్ చేసి చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే మేమిద్దరం చాలా ఏళ్లుగా స్నేహితులం. గత వారం కూడా మేం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘భూత్ బంగ్లా’ షూటింగ్ చేశాం” అని ప్రియదర్శన్ పేర్కొన్నారు.
పరేష్ రావల్ తన నిర్ణయంపై స్పందిస్తూ, తనకు ఎటువంటి సృజనాత్మక విభేదాలు లేవని, దర్శకుడు ప్రియదర్శన్‌పై తనకు అపారమైన ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నాయని ట్వీట్ చేశారు. అయితే, ప్రియదర్శన్ మాత్రం పరేష్ తన నిర్ణయం గురించి నేరుగా తనతో చెప్పలేదని స్పష్టం చేశారు. “నేను ఫోన్ చేయగా, ‘దయచేసి నాకు ఫోన్ చేయవద్దు. ఇది నా నిర్ణయం, దీనికి మీతో సంబంధం లేదు’ అని పరేష్ మెసేజ్ పంపారు. మళ్లీ కలిసి పనిచేద్దామని కూడా రాశారు” అని ప్రియదర్శన్ తెలిపారు.
పరేష్ రావల్ తప్పుకోవడం వల్ల అక్షయ్ కుమార్‌కు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ప్రియదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. “మా కాంట్రాక్టులన్నీ పూర్తయ్యాయి. పది రోజుల క్రితం సునీల్, అక్షయ్, పరేష్ ఒక సన్నివేశం, ఐపీఎల్ టీజర్ షూట్ చేశారు. మేమంతా ఏకగ్రీవంగా ‘హేరా ఫేరీ 3’ చేయడానికి అంగీకరించిన తర్వాతే అక్షయ్ ఫ్రాంచైజీ హక్కులను కొనుగోలు చేశారు. పరేష్ కేవలం ఒక ఆలోచనతో తప్పుకుంటే అక్షయ్ ఆర్థికంగా నష్టపోకూడదు. అవసరమైన చర్యలు తీసుకోవడానికి అక్షయ్‌కు అన్ని హక్కులు ఉన్నాయి” అని ప్రియదర్శన్ అన్నారు.
పరేష్ రావల్ తన బాబురావు పాత్రతో సంతృప్తి చెందడం లేదని, దాన్ని వదిలించుకోవాలని ఉందని గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఒప్పంద ఉల్లంఘన, భారీ ఆర్థిక నష్టాలను పేర్కొంటూ పరేష్ రావల్‌పై రూ. 25 కోట్ల దావా వేసింది. ఈ వివాదం బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.