భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. శ్రీరాముడు, సీత పాత్రల్లో ప్రభాస్, కృతిసనన్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శనివారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌తో పాటు ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్‌ను విడుదల చేశారు.
ఇందులో రాముని రాక కోసం కంట కన్నీరు నింపుకొని శోకతప్త హృదయంతో ఎదురుచూస్తున్నది మహాసాధ్వి జానకి. ‘రాం సియా రామ్’ ఆడియో టీజర్ శ్రోతల్ని భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్లిన భావన కలిగిస్తున్నది. జానకి పాత్రలోని దైవత్వం, ధైర్యాన్ని చాటుతూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. ఈ గీతానికి సచేత్-పరంపర స్వరపరిచారు. టీ-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.