Kriti Sanon | సినీ పరిశ్రమ వెలుపల నుంచి చూస్తే గ్లామర్, స్టార్డమ్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ మెరుపుల వెనుక ఎన్నో అసమానతలు, సవాళ్లు, వివక్ష కూడా ఉంటాయని పలువురు నటీమణులు గతంలో వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే జెండర్ వివక్షపై బహిరంగంగా మాట్లాడి చర్చనీయాంశంగా మారారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి సనన్.. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ హీరో తనను కావాలనే పక్కన పెట్టేందుకు ప్రయత్నించాడని, తాను ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరుకావాలో కూడా ఆయనే నిర్ణయించాలనుకున్నాడని తెలిపారు.
అలాంటి పరిస్థితి తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని, నా అవసరం లేదనుకుంటే మీరు ఒక్కరే సినిమా ప్రమోట్ చేసుకోండి అని చెప్పి తాను వెనక్కి తగ్గినట్లు వెల్లడించారు. సినిమా సెట్స్‌లో కూడా మహిళా నటీమణులకు, పురుష నటులకు ఇచ్చే ప్రాధాన్యంలో స్పష్టమైన తేడా కనిపించేదని కృతి అన్నారు. హీరోలకు పెద్ద వానిటీ వాన్లు, విశాలమైన గదులు, లగ్జరీ కార్లు ఏర్పాటు చేస్తే.. హీరోయిన్లకు మాత్రం చిన్న గదులు, సాధారణ వాహనాలు కేటాయించేవారని చెప్పారు. తనకు గదుల పరిమాణం లేదా కార్లపై ఆసక్తి లేదని, కానీ అలాంటి తేడాలు మహిళలను తక్కువగా చూసే భావనను కలిగిస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. సీనియర్ హీరోల విషయంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు సహజమేనని అంగీకరించిన కృతి.. కొత్తగా వచ్చిన హీరోల విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్లు హీరో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్లను గంటల ముందే సెట్స్‌కు పిలిచి వేచి ఉండేలా చేసేవారని ఆమె విమర్శించారు.
తాను నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోకపోవడంతో పాత్ర గురించి దర్శకులను ప్రశ్నిస్తే లేదా ఏదైనా సూచన చేస్తే.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అంటూ తన మాటలను పట్టించుకునేవారు కాదని కృతి తెలిపారు. అయితే అదే విషయాన్ని ఓ పురుష నటుడు చెబితే వెంటనే అంగీకరించి, అతని సూచనకు ప్రాధాన్యం ఇచ్చేవారని ఆమె పేర్కొన్నారు. మహిళలు అభిప్రాయం చెబితే దాన్ని అతిగా చూస్తారని, పురుషులు మాట్లాడితే మాత్రం దాన్ని వారి కమిట్మెంట్గా భావిస్తారని ఆమె విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం కంటే, సమాన గౌరవం కోసం గొంతు విప్పడం అవసరమని కృతి సనన్ అభిప్రాయపడ్డారు. కార్యాలయంలో గానీ, సినిమా సెట్స్‌లో గానీ మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం దక్కాలని ఆమె కోరారు.