నటీనటులు: మనోజ్ చంద్ర, మోనిక టి, ఉష బోనెలా, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్
దర్శకురాలు: ప్రవీణ పరుచూరి
నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి
సంగీతం: మణి శర్మ, వరుణ్ ఉన్ని
సినిమాటోగ్రఫీ: పెట్రోస్ అంటోనియాడిస్
కూర్పు: కిరణ్ ఆర్
విడుదల తేదీ : జూలై 18, 2025
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు (Kothapallilo Okappudu). దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా.. పరచూరి విజయ్ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి నిర్మించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెలను వంటి నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఇది 1997 నాటి కొత్తపల్లి అనే మారుమూల గ్రామం కథ. ఊరి ప్రజలకు అప్పులిచ్చి, వడ్డీలతో పీడించేవాడు అప్పన్న (రవీంద్ర విజయ్). అతని దగ్గరే పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర), ఆ ఊరి జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక)ని చిన్నతనం నుంచే ప్రేమిస్తాడు. అయితే, తన ప్రేమను ఆమెకు చెప్పే క్రమంలో అతనికి మరో అమ్మాయితో బలవంతంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరోవైపు, అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊరిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అప్పన్న పట్ల ఆ ఊరి జనానికి ఉన్న భయం అపారమైన భక్తిగా ఎలా మారింది? అప్పన్నకు, రెడ్డికి మధ్య ఉన్న వైరం ఏమిటి? అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘కేరాఫ్ కంచరపాలెం’ మేకర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కనీస అంచనాలు ఉంటాయి. ఈ సినిమా వాటిని కొంతమేర అందుకుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా సహజత్వంతో కూడిన విజువల్స్ మరియు సంభాషణలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ ఆరంభం కాస్త సాదాసీదాగా మొదలైనా, ఆ తర్వాత సినిమా పుంజుకొని మంచి కామెడీ సీన్స్‌తో సాగుతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. దర్శకురాలు ప్రవీణ పరుచూరి ఎంచుకున్న కథాంశం బాగుంది. దానికి అనుగుణంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా సెకండాఫ్ ని ఎమోషనల్ సీన్స్ మరియు మెయింటైన్ చేసిన థ్రిల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో ఎంచుకున్న కథా నేపథ్యం బాగున్నప్పటికీ, థియేటర్‌కి వచ్చి చూసే సాదాసీదా ప్రేక్షకుడికి అర్థం కాకపోవచ్చు. సినిమా మొదలయ్యేటప్పుడే ఒక కొటేషన్ ఉంటుంది – ‘మనం వస్తువులను ఉన్నట్టుగా చూడము, మనం ఎలా అనుకుంటున్నామో అలా చూస్తాము.’ ఇది చదివే వారికి ఓకే కానీ, దీని గురించి తెలియకుండా సినిమాలో జరిగే డ్రామా అంతా చూస్తే మాత్రం ప్రేక్షకుడికి ఒకింత సిల్లీ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అప్పన్న బండిపై చూపించే కొన్ని సన్నివేశాలు, ఆ ఊరి జనం ఆకస్మిక మార్పు, మూఢ నమ్మకాలు వంటివి ఒకింత అతిగా, బలవంతంగా అనిపిస్తాయి.
నటీనటులు
ఇక నటీనటుల్లో డెబ్యూ నటులు బాగా చేశారు. హీరో మనోజ్ చంద్ర ఉత్తరాంధ్ర మాండలీకంలో మంచి బాడీ లాంగ్వేజ్, లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. అతని కామెడీ టైమింగ్ కూడా సినిమాలో బాగుంది. అలాగే హీరోయిన్ మౌనిక తన పాత్రకి సరిగ్గా సరిపోయింది. సహజమైన లుక్స్‌తో మంచి నటన కనబరిచింది. ఇక వీరితో పాటుగా ఉషా బోనెలా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఆమెపై తెరకెక్కించిన కామెడీ సీన్స్, ముఖ్యంగా హీరోతో ఉన్న సీన్స్ సరదాగా ఉన్నాయి. వీరితో పాటుగా మరో సాలిడ్ పెర్ఫార్మర్ రవీంద్ర విజయ్ అప్పన్నగా తన మార్క్ సహజ నటన, మాడ్యులేషన్స్‌తో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. బెనర్జీ, బాబు మోహన్ వంటి సీనియర్ నటులు తమ అనుభవాన్ని చూపించారు. అలాగే నటుడు రవీంద్ర విజయ్ పాత్ర ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. తన రోల్ అర్ధాంతరంగా ఆపేయడాన్ని ఇంకొంచెం ప్రభావవంతంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓకే రేంజ్లో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగాలేవు. మణిశర్మ అందించిన పాటలు బాగున్నాయి. వరుణ్ ఉన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పెట్రోస్ అంటోనియాడిస్ సినిమాటోగ్రఫీ బాగుంది. మంచి సన్నివేశాలు చూపించారు. అలాగే ఎడిటింగ్ కూడా ఓకే కానీ, కొన్ని సీన్స్‌ని ట్రిమ్ చేయాల్సింది. డబ్బింగ్ చాలా సహజంగా ఉండి సినిమాకి మరింత న్యాచురాలిటీని తీసుకొచ్చింది. ఇక సినిమాలో నటిగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే.. ఆమె ఒక అందమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. తాను అనుకున్న పాయింట్‌ని దాదాపు మంచి ఎమోషనల్‌గా అలాగే ఫన్‌తో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఇందులో కొన్ని చోట్ల మాత్రం ఆ సహజత్వం లోపించింది. అనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నంలో కథనాన్ని ఇంకొంచెం బెటర్ సీన్స్‌తో డిజైన్ చేసుకుని ఉంటే ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ మరికాస్త ఫీల్ గుడ్‌గా అనిపించి ఉండేది. మొత్తంగా ఆమె పనితీరు ఓకే అని చెప్పొచ్చు.
చివరిగా.. “కొత్తపల్లిలో ఒకప్పుడు” కొన్ని చోట్ల మెప్పించే విలేజ్ కామెడీ, థ్రిల్లర్ డ్రామా అని చెప్పొచ్చు. లీడ్ నటీనటులు బాగా చేసి ఆకట్టుకున్నారు. సినిమాలో కథాంశం బాగుంది, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో మాత్రం సిల్లీగా అనిపిస్తాయి, ప్రేక్షకులకు ఈ వీకెండ్ మంచి ఎంటర్టైనింగ్ సినిమా అవుతుంది.