Na Wife Missing | ప్రముఖ నటులు వరుణ్ సందేశ్, శ్వేతా బస్సూ ప్రసాద్ జంటగా నటించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘నా Wife మిస్సింగ్’. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేయగా ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
అమలాపురం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య అకస్మాత్తుగా అదృశ్యం కావడం, ఆ తర్వాత భర్త పోలీసులను ఆశ్రయించడం, భార్య గతం తాలూకు కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాక భర్తలోనే ఆమెపై అనుమానాలు మొదలుకావడం వంటి ఆసక్తికరమైన మలుపులతో ఈ టీజర్ సాగుతుంది. స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై శివ కాంతనేని, ఆర్. వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, శ్వేతా బస్సూ ప్రసాద్‌తో పాటు ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా అక్టోబర్ 22 నుండి ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.