Koratala Siva | టాలీవుడ్లో మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన పేరు వినగానే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి అన్నది అతిశయోక్తి కాదు. అరవై ఏళ్ల వయసులో కూడా ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ బాలయ్య తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి వరుస హిట్స్‌తో బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రతి సినిమాలో తన మాస్ ఇమేజ్ను మరింత పెంచుకుంటూ, కథానుసారం కొత్త కోణాలను కూడా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్, డైలాగ్ డెలివరీలో ఆయనకు సాటి లేరని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ మొదలైంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ కోసం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యువ దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి కొరటాల చెప్పిన కథ బాలయ్యను బాగా ఇంప్రెస్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారని టాక్. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కొరటాల శివకు కమర్షియల్ సినిమాల్లో సామాజిక సందేశాలను చక్కగా మిళితం చేసే ప్రత్యేక శైలి ఉంది. ‘మిర్చి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాలతో వరుసగా భారీ విజయాలను అందుకున్నారు. అలాగే దేవర: పార్ట్ 1తో కూడా గ్లోబల్ స్థాయిలో మంచి విజయాన్ని సాధించి తన మార్క్‌ను మరోసారి నిరూపించారు. హీరో పాత్రను పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడం, కథలో బలమైన ఎమోషన్ మరియు సందేశాన్ని ఇవ్వడం ఆయన స్టైల్. ఇప్పుడు బాలకృష్ణ మాస్ ఇమేజ్ , కొరటాల శివ కథనం కలిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రావడం ఖాయం అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం కొరటాల చేయొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.