Trisha Krishnan | ఐదేళ్లక్రితం కెరీర్‌పరంగా త్రిష పనైపోయిందనే ప్రచారం జరిగింది. ఇక ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయడం బెటర్ అనే మాటలు వినిపించాయి. కానీ ‘పొన్నియన్ సెల్వన్’ ఫ్రాంఛైజీతో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తారాపథంలో అగ్రస్థానంలో దూసుకెళ్లింది. ఇక అక్కడి నుంచి తమిళనాట త్రిష జైత్రయాత్ర కొనసాగుతున్నది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష పెట్టిన పోస్టే కారణమైంది. సంప్రదాయ వస్ర్తాలను ధరించి పెళ్లి కూతురిలా ముస్తాబై వున్న ఓ ఫోటోను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆకుపచ్చ రంగు చీరలో ఒంటి నిండుగా బంగారు ఆభరణాలతో, చేతికి ఉంగరం ధరించి ఉన్న త్రిష ఫొటో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
దీనికి ‘ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అనే క్యాప్షన్‌ను జత చేసింది త్రిష. దీంతో ఆమె ప్రేమలో పడిందని, మనసిచ్చిన వాడితో మనువాడడానికి సిద్ధమవుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేశారు. త్రిష ముఖంలో పెళ్లి కళ కనిపిస్తున్నదని ఆమె అభిమానులు సంబరపడిపోయారు. కొందరైతే ఎంగేజ్మెంట్ చేసుకుందేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. ఏదిఏమైనా త్రిష పెట్టిన ఆ ఫొటో పెళ్లి గురించిన పుకార్లకు వేదికైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌లో ఆమే కథానాయిక.