Kiran Abbavaram | యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం దిల్రుబా (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో కిరణ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి నేను తోడుంటానని తెలిపాడు.
హైదరాబాద్‌లోని కృష్ణ నగర్‌కి నేను వచ్చినప్పుడు నాతో పాటు 50 మంది ఉండేవాళ్లం. అందరం కలిసి పనిచేయాలని చెప్పి బావార్చి దగ్గర కలిసేవాళ్లం. స్టోరీలు చెప్పుకునేవాళ్లం. అయితే రోజురోజుకి మా సంఖ్య తగ్గి 50 నుంచి 10కి పడిపోయింది. ఇప్పుడయితే ఇద్దరు ముగ్గురు కూడా కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే అవకాశలు రావడం. అవకాశం వచ్చిన వాళ్లు ఇక్కడనే సెటిల్ అవుతారు. కానీ అవకాశలు రాకుండా అలానే మిగిలిపోయిన వాళ్లు ఇంటికివెళ్లిపోతున్నారు. సినిమాలు అంటే పేరెంట్స్‌కి కూడ నమ్మకం లేదు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి నేను తోడుండాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చిన్న హీరోనే కానీ నాకు తోచినంతా సాయం చేయడం చేస్తాను. ప్రతి సంవత్సరం సినిమా అంటే పిచ్చి ఉండే 10 మంది వ్యక్తులకు నేను ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆదుకుంటాను. కొత్త వారిని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలలో కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వమని నిర్మాతలను అడుగుతాను. నాకంటే టాలెంట్ ఉన్నవాళ్లు చాలమంది బయట ఉన్నారు. నాకు అవకాశం వచ్చింది. మీకు రేపు అవకాశం రావచ్చంటూ కిరణ్ చెప్పుకోచ్చాడు.