సినిమా పేరు : “క”
తారాగణం: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీరామ్..
దర్శకత్వం: సుజీత్, సందీప్
నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
టైటిల్ దగ్గర్నుంచి, ప్రచార చిత్రాల వరకూ వైవిధ్యంగా ముందుకెళ్లారు ఈ సినిమా మేకర్స్. అందుకే సినిమాపై హీరో కిరణ్ అబ్బవరం స్థాయికి మించిన అంచనాలు ఏర్పాడ్డాయి. కథ గురించి మేకర్స్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం.. పీరియాడిక్ కథాంశం కావడం, ఓ భిన్నమైన నేపథ్యం.. ఇవన్నీ సినిమాపై ఆడియన్స్‌కి ఆసక్తిని రేకెత్తించిన అంశాలు. మరి “క” అందరి అంచనాలనూ నిజం చేసిందా? అసలు ఈ “క” ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకెళ్లాలి..
కథ
ఓ జైలు లాంటి చీకటి గదిలో కథ మొదలవుతుంది. ఆ గది మధ్య ఓ టేబుల్. దానికి అటుఇటు కూర్చోడానికి రెండు కుర్చీలు. ఆ టేబుల్‌పై గడియారాన్ని పోలిన ఓ యంత్రం. నడినెత్తిపై లైట్.. ఇది సెటప్. హీరో వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) ఆ గదిలో బంధించి ఉంటాడు. తనెందుకు అక్కడ బంధింపబడ్డాడో తనకి అర్థం కావడంలేదు. ఇంతలో ఓ ముగ్గురు ముసుగు మనుషులు ఆ గదిలోకి ప్రవేశించారు. వారిలో మధ్యలోని ముఖ్యమైన వాడు వాసుదేవ్‌ని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టాడు. ‘అసలు 1977లో నువ్వు కృష్ణగిరి గ్రామంలోకి ఎందుకు ప్రవేశించావ్?’ అనడిగాడు. వాసుదేవ్ చెప్పనని మొరాయించాడు. టేబుల్ మీదున్న గడియారంలాంటి యంత్రం గిర్రున తిరిగింది. దాని నుంచి వెలువడిన శక్తివల్ల వాసుదేవ్ నిదానంగా హిప్నటయిజ్ అయ్యాడు. చెప్పడం మొదలుపెట్టాడు. 1960ల్లో కథ మొదలైంది. వాసుదేవ్‌కి అప్పుడు పదేళ్లు ఉంటాయి. తనో అనాధ, అనాధ శరణాలయంలో బతుకుతుంటాడు. ‘నా’ అన్నవాళ్లు లేకపోవడంతో ఇతరులకు వచ్చిన ఉత్తరాలు చదవే చెడ్డబుద్ధిని అలవాటు చేసుకుంటాడు. ఇతరులకు వారి బంధువులు రాసిన ఉత్తరాలు చదువుతూ, తనకే ఆ ఉత్తరాలు వచ్చినట్టు ఫీలవుతుంటాడు. ఈ ఆనందం రోజూ ఉండాలని, తనో పోస్ట్‌మ్యాన్ కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ అలవాటులో భాగంగా శరణాలయం వార్డెన్ ఉత్తరం చదువుతూ వార్డెన్‌కి దొరికిపోతాడు. అతను వాసుదేవ్‌ని కొట్టి, మందలించి వదిలిపెట్టేస్తాడు. ఓ రోజు వార్డెన్ దగ్గరున్న డబ్బును దొంగిలించి, శరణాలయం నుంచి పారిపోతాడు వాసుదేవ్. తన కూతురు ఆపరేషన్‌కోసం వార్డెన్ దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బు పోవడంతో వార్డెన్ షాక్‌కి గురవుతాడు. ఆపరేషన్ జరగకపోవడంతో అతని కూతురు చనిపోతుంది. ఇవేమీ పారిపోయిన వాసుదేవ్‌కి తెలీదు. తాను ఆ డబ్బుతో వేరే ఊరు చేరుకొని తన ఆశయసాధన కోసం టెన్త్ వరకూ చదువుపూర్తి చేస్తాడు. కృష్ణగిరి అనే ఊళ్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి, ఆ ఊరు చేరుకుంటాడు. ఇక అక్కడ ఎదురైన పరిణామాలేంటి? అసలు వాసుదేవ్ ఆ జైల్లో ఎందుకు పడ్డాడు? అతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
విశ్లేషణ
కర్మసిద్ధాంతం నేపథ్యంలో సాగే కథ ఇది. ‘పునరపి జననం.. పునరపి మరణం.. పునరపి జననీ జఠరే శయనం.. ’ అదే ఈ సినిమా కాన్సెప్ట్. దర్శకులు సుజీత్, సందీప్ చాలా కొత్తగా ఆలోచించారు. కొత్త సినిమాలు తెలుగులో రావు అనేవాళ్లకు సరైన సమాధానం ఈ సినిమా. జైల్లో హీరో తన కథ చెబుతూ ఉంటే కథ నడుస్తుంది. అసలు తనెందుకు జైలు పాలయ్యాడు? అనే ప్రశ్నకు సమాధానం క్లయిమాక్స్ దాకా రాకపోవడం కాస్త అసహనానికి గురి చేస్తుంది. చివరికి అసలు విషయం రివీలయ్యాక.. ఓ విధమైన సంభ్రమకు లోనవుతాం. అంతసేపూ అంతర్లీనంగా మెదిలిన అనుమానాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. అదే ఈ కథకూ కథనానికీ ఉన్న ప్రత్యేకత. అసలు విషయం చివరి దాకా రివీల్ కాదు గనుక, సందేహాల మధ్యే రెండు గంటలు విసుగు రాకుండా కథ నడిపించాలి. ఇది దర్శకులకు కత్తిమీద సామే. కానీ ఆ విషయంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. సన్నివేశాలు బాగా రాసుకోవడం వల్ల, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆడియన్స్‌కి విసుగు అనిపించదు. 1977 నాటి వాతావరణం.. నాటి ప్రజల ఆహార్యం, నడవడిక, ఇవన్నీ చాలా చక్కగా ఆవిష్కరించారు. అయితే.. పీరియాడిక్ సీన్స్ తీసేటప్పుడు అక్కడక్కడ కాస్త పొరపాట్లు తడబాట్లు జరిగాయి. అంతేకాక సినిమా నడక కూడా కాస్త నెమ్మదించింది. మిగతా అన్ని విషయాలూ అభినందనీయంగానే ఉన్నాయి. ముఖ్యం ైక్లెమాక్స్ అద్భుతం.. అసలు ఆ జైల్ ఏంటి? హీరో ఎందుకు జైలు పాలయ్యాడు? వీటి సమాధానాలను రివ్యూలో రివీల్ చేసేస్తే.. చూసేటప్పుడు కిక్ ఉండదు. అందుకే.. ఆ విషయాన్ని రివీల్ చేయకపోవడమే బెటర్.
నటీనటులు
కిరణ్ అబ్బవరం చాలా గొప్పగా నటించాడు. ఓ విధంగా ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రల్నీ చక్కగా అభినయించాడు. సందర్భాన్ని బట్టి ఎమోషన్స్‌ని బాగా ఆవిష్కరించాడు. వాసుదేవ్ పాత్ర అతని కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నటుడిగా ఈ సినిమాతో తను ఓ మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్లు నయన్ సారిక, తన్వీరామ్ ఇద్దరూ చక్కగా అభినయించారు. వీరిలో నయన్ సారిక అందంతో మెరిపిస్తే, తన్వీరామ్ అభినయంతో ఆకట్టుకున్నది. మిగతా పాత్రధారులంతా పరిధిమేర రక్తికట్టించారు.
సంకేతిక నిపుణులు
స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన స్క్రిప్ట్.. దానికి తోడు వైవిధ్యమైన స్క్రీన్‌ప్లే. ఇది పూర్తిగా దర్శకుల సినిమా. దర్శకులు సుజీత్, సందీప్ తమ భుజాలపై సినిమాను మోశారు. నిర్మాణవిలువల పరంగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ఎక్కడా రాజీపడలేదు. ముఖ్యంగా కృష్ణగిరి గ్రామం సెట్ చాలా బావుంది. కళా దర్శకుడ్ని ఇక్కడ అభినందించాలి. అలాగే ఛాయాగ్రహణం కూడా చాలా బావుంది. దర్శకులిద్దరూ ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కృష్ణగిరి గ్రామంలో కూర్చోబెట్టారు. నేపథ్య సంగీతం చాలా బావుంది. పాటలు కూడా పర్లేదు. ఎడిటర్‌కి ఇంకాస్త పనుందేమో అనిపించింది. మొత్తంగా “క” మంచి సినిమా. విభిన్నమైన సినిమా. కచ్చితంగా చూడాల్సిన సినిమా. రొడ్డకొట్టుడు సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే సినిమా.
బలాలు
కథ, కథనం, దర్శకత్వం, నటీనటుల నటన, నేపథ్య సంగీతం
బలహీనతలు
కథ గమనంలో నిదానం, ఎడిటింగ్
రేటింగ్
3/5