కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలైంది. దేవికా భట్ కథానాయికగా పరిచయం కానున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి నిర్మాత. సీనియర్ నటులు శరత్‌కుమార్, సాయికుమార్ కీలక పాత్రధారులు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగాయి. పూజ అనంతరం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. తొలి షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నది. ఈ చిత్రం కథ, కథనాన్ని కూడా కిరణ్ అబ్బవరమే అందిస్తున్నారు.
పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా సాగే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్టు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. ప్రేక్షకులకు నచ్చే అంశాలతోపాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు ఆయన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. భారీ గంగాళం, మంటలు, పొగల నేపథ్యంలో సంప్రదాయ గ్రామీణ యువకుడి గెటప్‌లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరంని ఈ పోస్టర్లో చూడొచ్చు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డేనియల్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: జాయ్ ఫిల్మ్స్.