Actor Siddique | లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు సిద్దిక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సరైన దర్యాప్తు జరిగేందుకు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సీఎస్ డయాస్ బెయిల్‌కు తగిన కేసు కాదన్నారు. పొటెన్సీ టెస్ట్ జరుగలేదని.. సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఓ వ్యక్తి లైంగిక శక్తిని, సంతానోత్పత్తిని నిర్ణయించేందుకు పొటెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన సమయంలో సాధారణంగా ఈ టెస్ట్ నిర్వహిస్తారు. తద్వారా ఆ వ్యక్తి సంభోగంలో పాల్గొనే సామర్థ్యం ఉన్నదా? లేదా? అనేది తేలుంది.
కేసు సమగ్ర దర్యాప్తు కోసం నిందితులను కస్టడీలో ఉంచడం అవసరం చట్టం స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని దారుణాలపై జస్టిస్ హేమా కమిటీ సంచలన నివేదిక బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మీటూ ఉద్యమంలో పలువురు నటీనటులు, దర్శకులు, హీరోలు వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో సిద్దిక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఓ సినిమాలో అవకాశం కోసం తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధిరాలు ఆరోపించింది. ఆయన డిమాండ్లను తిరస్కరించడంతో 2016లో తిరువనంతపురంలో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను సిద్దిక్ ఖండించారు. 2019 నుంచి ఆమె తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఆరోపణలను కండించారు. తాజాగా తనను అరెస్టు చేయకుండా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తిరస్కరించింది.