Jayam Ravi-Aarti divorce | తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తీ విడాకుల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. జయం రవి, ఆర్తీల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో ఆర్తీ తన భర్త నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, తమ విడిపోవడానికి “మూడో వ్యక్తే” కారణమని ఆర్తీ పరోక్షంగా కెనీషాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. ఇదిలావుంటే జయం రవితో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయని కెనీషా ఫ్రాన్సిస్, తనకు హాత్య బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. అంతేకాదు, తాను తప్పు చేస్తే తనను కోర్టుకు తీసుకెళ్లాలని సవాల్ విసిరారు.
కెనీషా ఫ్రాన్సిస్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని, తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. “నేను తప్పు చేస్తే, నాపై మీకు ఆధారాలు ఉంటే, నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి” అని ఆమె సవాల్ విసిరారు. ఈ వివాదంలో తనను అకారణంగా నిందిస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.
జయం రవి-ఆర్తీల వివాదం కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, కెనీషా ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత ఉత్కంఠను జోడించాయి. మరోవైపు జయం రవి-ఆర్తీ విడాకుల కేసు తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది.