Keerthy Suresh | ‘మహానటి’ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు, లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమ వివాహం చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను కీర్తి సురేష్ తాజాగా పంచుకుంది. తాము 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఒకానొక దశలో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే ‘లేచిపోయి’ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పెళ్లి ఇంత వైభవంగా, అందరి సమక్షంలో జరుగుతుందని తాము అస్సలు ఊహించలేదని, కానీ చివరికి పెద్దల అంగీకారంతో గోవాలో కుటుంబ సభ్యుల మధ్య తమ వివాహం వేడుకగా జరిగిందని కీర్తి పేర్కొంది.
పెళ్లి సమయంలో జరిగిన భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకుంటూ, ఎప్పుడూ చాలా ధైర్యంగా, దృఢంగా ఉండే ఆంటోనీ తాళి కట్టే సమయంలో తొలిసారి ఎమోషనల్ అయ్యాడని ఆమె తెలిపింది. ఆయన కళ్లలో నీళ్లు చూడటంతో తాను కూడా భావోద్వేగానికి లోనయ్యానని, 15 ఏళ్ల నిరీక్షణ కేవలం 30 సెకన్ల మంగళసూత్ర ధారణతో ఒక అందమైన బంధంగా మారిందని కీర్తి ఆనందం వ్యక్తం చేసింది. ఆ క్షణం ఒక కల నిజమైనట్లు అనిపించిందని, ఆ ఆనందంలో కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, వరుస సినిమాలతో కెరీర్ పరంగా కూడా దూసుకుపోతోంది.