పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్తంత నెమ్మదించిన అందాలభామ కీర్తి సురేశ్, ఇప్పుడు మళ్లీ స్పీడందుకున్నారు. కోలీవుడ్‌లో రెండు సినిమాలకు సైన్ చేసిన ఈ మహానటి.. టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ కాగా, రెండోది నితిన్ ‘ఎల్లమ్మ’. రెండూ దిల్‌రాజు సినిమాలే కావడం విశేషం. కీర్తి సురేష్ ‘మహానటి’లో విజయ్ దేవరకొండ ‘ఆంటోని’ అనే జర్నలిస్ట్‌గా నటించారు.
అయితే.. కీర్తి సురేశ్‌తో కాంబినేషన్ సీన్స్ మాత్రం ఆ సినిమాలో ఉండవ్. ఆ విధంగా చూసుకుంటే కీర్తి, విజయ్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలోసాగే యాక్షన్ ఎంటైర్టెనర్ అని సమాచారం. ఇక నితిన్ ‘ఎల్లమ్మ’ విషయానికొస్తే.. బ్లాక్‌బస్టర్ ‘బలగం’ తర్వాత వేణు యల్దెండి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా.. ఆధ్యాత్మికత, సంప్రదాయ కళల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తున్నది. ఈ రెండు సినిమాల కోసం కీర్తి రెండేళ్ల పాటు డేట్స్ ఇచ్చిందట.