వాణిజ్య చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూనే మరోవైపు ప్రయోగాత్మక పాత్రల ద్వారా ప్రతిభను చాటుకుంటోంది అగ్ర నాయిక కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాలో అద్భుతాభినయాన్ని కనబరచి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ సవాళ్లతో కూడుకున్న పాత్రలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘సాని కాయిదమ్’. ఈ సినిమాలో కీర్తి సురేష్ దోపిడి దొంగ పాత్రలో నటిస్తోంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఆమె ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. నెగెటివ్ ఛాయలతో సాగే ఈ పాత్ర తన కెరీర్లో గుర్తుండిపోతుందని చెబుతోంది కీర్తి సురేష్. మంగళవారం చెన్నైలో ఈ సినిమా షూటింగ్‌ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ‘బ్యాక్ టూ షూటింగ్ లైఫ్’ అంటూ కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. చాలా కాలం విరామం తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని చెప్పింది. అరుణ్మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తమిళనాడులో 1980 దశకంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అన్యాయాల్ని ఎదిరించే క్రమంలో దోపిడి దొంగలుగా మారిన ఇద్దరు వ్యక్తులు..వారి జీవితంలోని అనూహ్య మలుపులతో క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.