Karuppu Sequel | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్-ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భారీ కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
సక్సెస్ మీట్లో మాట్లాడిన హీరో సూర్య.. ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దర్శకుడు ఆర్జే బాలాజీ చెప్పిన కథ తనను మొదటి వినిపించిన క్షణం నుంచే ఆకట్టుకుందని అన్నారు. ఆర్జే బాలాజీ విజన్‌పై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఆయన కథ చెప్పిన గంటలోపే నేను ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అన్నీ చాలా పాజిటివ్‌గా జరిగాయి. సినిమా మంచి విజయం సాధిస్తుందని అనుకున్నాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారని మాత్రం ఊహించలేదు అంటూ సూర్య ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సక్సెస్ ఈవెంట్లో అభిమానులు ఎక్కువగా ఎదురుచూసిన అంశం ‘కరుప్పు’ సీక్వెల్ గురించే. ఇప్పటికే సోషల్ మీడియాలో రెండో భాగం వస్తుందా? అనే చర్చలు జరుగుతున్న వేళ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సీక్వెల్ గురించి ప్రశ్నించగా సూర్య నవ్వుతూ.. “రెండో భాగం రావాలని నేను కూడా అభిమానుల్లాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వస్తాయి” అని చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా ఈ భారీ విజయంపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయం మొత్తం ప్రేక్షకుల ప్రేమ, చిత్రబృందం కష్టానికి వచ్చిన ఫలితమని తెలిపారు. ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం నిజంగా ఒక వరంలా భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో మాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు.