కామెడీ హారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని మరోసారి నిరూపించింది ‘భూల్ భులయ్యా 2’ చిత్రం. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించి 2017లో విజయం సాధించిన ‘భూల్ భులయ్యా’ చిత్రానికి ఇది సీక్వెల్. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో భారీ వసూళ్లు రాబట్టుతున్నది. రిలీజైన 9వ రోజుకి 100 కోట్ల రూపాయల వసూళ్లను దాటేసింది.
హారర్ అంశాలకు హ్యూమర్ కలిపి ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందించారు దర్శకుడు అనీస్ బాజ్మీ. ఈ సినిమా విజయం కార్తీక్ ఆర్యన్, కియారాలకు మరో సూపర్హిట్ను ఖాతాలో వేసింది. కోవిడ్ పరిస్థితుల తర్వాత కోలుకుంటున్న బాలీవుడ్లో ‘గంగూభాయ్ కథియావాడి’, ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాల తర్వాత వందకోట్ల రూపాయల వసూళ్ల చిత్రాల జాబితాలో చేరింది. ఈ సినిమా విజయంతో కార్తీక్ ఆర్యన్ తన పారితోషికం పెంచేసినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాకు 15 నుంచి 20 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఈ యువ హీరో…తన తదుపరి సినిమాకు 35 నుంచి 40 కోట్ల రూపాయల డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.