‘నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? అనే సంభాషణతో మొదలైన ‘కాంతార-ఛాప్టర్ 1’ ట్రైలర్ ఆద్యంతం దైవిక, పోరాట ఘట్టాల కలబోతగా ఆకట్టుకుంది. రిషబ్‌శెట్టి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను అగ్ర హీరో ప్రభాస్ విడుదల చేశారు. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘కాంతార’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. దాంతో సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో..ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు.
ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో..’ అనే డైలాగ్ ఈ సినిమా కథ తాలూకు ఆత్మను ప్రతిబింబించేలా ఉంది. 3వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ఈ కథలో రిషబ్‌శెట్టి తన ప్రజల్ని రక్షించే వీరుడిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. యువరాణి పాత్రలో కథానాయిక రుక్మిణి వసంత్ మెరిసిపోయింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.