Kantara Chapter 1 | కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సర్ప్రైజ్ అందించింది ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ సినిమా బృందం. చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ లుక్ అదిరిపోయేలా ఉంది. వరాహస్వామి గర్జిస్తే ఎలా ఉంటుందో… అలా తాజా పోస్టర్లో వీరోచితంగా రిషబ్ శెట్టి కనిపించారు. ఈ లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో రిషబ్ ముఖం పూర్తిగా కనిపించలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన బర్త్‌డే పోస్టర్లో మాత్రం ఆయన పవర్ఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ అందించారు. ఇది అసలు సిసలైన ఫస్ట్ లుక్ అని అభిమానులు భావిస్తున్నారు. ‘కాంతార’ తొలి భాగం రిలీజైనప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలనే ఆలోచన రిషబ్కి లేదు. కానీ కన్నడలో ఘన విజయం సాధించిన తర్వాత తెలుగు, తమిళ, హిందీ సహా ఇతర భాషల్లో విడుదలై సంచలనం రేపింది. అదే విజయంతో ప్రీక్వెల్‌కు శ్రీకారం చుట్టారు. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2 (గాంధీ జయంతి)న విడుదల కానుంది.
సినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద రిలీజ్ అని పేర్కొంటున్నారు. ఈ ప్రీక్వెల్ సినిమాకు రిషబ్ శెట్టే దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పగా, ఈ కొత్త పోస్టర్ ఆ హైప్‌ని మరింత పెంచేసింది. ఈ చిత్రం కూడా భారీ హిట్ అవుతుందని ఆలోచనలు చేస్తున్నారు ఫ్యాన్స్.