చిత్రం – కాంతార: చాప్టర్ 1
నటీనటులు – రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు |
సంగీతం – అజనీష్ లోక్‌నాథ్
ఛాయాగ్రహణం – అరవింద్ ఎస్.కశ్యప్
రచన, దర్శకత్వం – రిషబ్ శెట్టి
నిర్మాణ సంస్థ – హోంబలే ఫిల్మ్స్
విడుదల తేదీ – 02-10-2025
Kantara Chapter 1 Trailer Update | కన్నడ నుంచి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో ‘కాంతార: చాప్టర్ 1’ ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మించగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు బుధవారం ప్రీమియర్స్ ప్రదర్శించగా ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం.
కథ
8వ శతాబ్దంలో కదంబుల రాజ్యం పాలనలో జరిగే కథ ఇది. ఆ రాజ్యంలో ఒక అటవీ ప్రాంతంలోని దైవిక భూమే కాంతార. అక్కడున్న ఈశ్వరుడి పూదోటకు, మార్మిక బావికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ మహిమాన్వితమైన ప్రాంతంపై దుష్టశక్తుల కన్ను పడకుండా, బయటివారు అడుగు పెట్టకుండా కాంతార గిరిజన తెగ కాపాడుతుంటుంది. సుగంధ ద్రవ్యాలు పండిస్తూ జీవనం సాగించే ఈ తెగకు, అక్కడున్న బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. అతన్ని దైవ ప్రసాదంగా భావించి బెర్మే (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచుతారు. ఒకసారి తమ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన భాంగ్రా రాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) అతని సైన్యాన్ని బెర్మే వేటాడి బుద్ధి చెప్తాడు. ఈ ఘటన తర్వాత కాంతార సరిహద్దులు దాటి భాంగ్రా రాజ్యాన్ని చూసి రావాలన్న కోరిక బెర్మేకు కలుగుతుంది. అక్కడికి వెళ్లాక తమ సుగంధ ద్రవ్యాలను ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో గిరిజనులను వెట్టి పేరుతో ఎలా హింసిస్తున్నారో బెర్మే తెలుసుకుంటాడు. దీంతో తమ తెగను బాగు చేయడం వెట్టి నుంచి విముక్తం చేయడం కోసం బెర్మే ఒక నిర్ణయం తీసుకుంటాడు. భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? బెర్మే నిర్ణయం కాంతార గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది? కాంతారను ఈశ్వరుడి పూదోటను సొంతం చేసుకోవాలని భాంగ్రా రాజు రాజశేఖర్ (జయరామ్) ఎందుకు ప్రయత్నిస్తుంటాడు? అసలు ఆ ప్రాంతంలో ఉన్న దైవ రహస్యం ఏంటి? దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించే కడపటి దిక్కున ఉన్న అసురమూక కథేంటి? కాంతారను కాపాడుకోవడానికి బెర్మే చేసిన యుద్ధం ఏంటి? అన్నది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘కాంతార’ సినిమాలో హీరో అతని తండ్రి ఎక్కడ మాయమవుతారో సరిగ్గా అక్కడి నుంచే ‘కాంతార చాప్టర్ 1’ కథ ప్రారంభమవుతుంది. అసలు కాంతార ప్రాంతం ఏంటి? ఈశ్వరుడి పూదోట, మార్మిక బావి వెనకున్న దైవిక రహస్యాలేంటి? పంజుర్లి, గులిగ వంటి దైవిక గణాల కథేంటి? కాంతార గిరిజన తెగ జీవనం, సంస్కృతి ఏంటి? వంటి మూలాల్ని అన్వేషిస్తూ ఈ ప్రీక్వెల్ కథ సాగుతుంది. రిషబ్ సృష్టించుకున్న కొత్త ప్రపంచం (కాంతార గిరిజన తెగ, భాంగ్రా రాజ్యం, అసురజాతి) ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది.
సినిమా తొలి 20 నిమిషాల్లో కాంతార గిరిజన తెగల జీవితాలు, రాజు అణచివేతల్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఈశ్వరుడి పూదోటలోని బావి నేపథ్యంతో వచ్చే సీక్వెన్స్, అక్కడ పరిచయమయ్యే ఈశ్వర గణాల కథ థ్రిల్ పంచుతుంది. కనకావతి(రుక్మిణి వసంత్) పాత్ర తెరపైకి రావడం, హీరో ఆమెతో ప్రేమలో పడటం ఒక రొటీన్ రొమాంటిక్ ట్రాక్‌లా అనిపిస్తుంది. అయితే హీరో రాజును ఎదిరించి వ్యాపారానికి సిద్ధపడటం కథను మలుపు తిప్పుతుంది. ఇక, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే టైగర్ సీక్వెన్స్, కడపటి దిక్కు అసురజాతితో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి.ప్రథమార్థం అక్కడక్కడా నెమ్మదిగా సాగిన అనుభూతి కలిగించినా ద్వితీయార్థం కథ వేగంగా పరుగులు పెడుతుంది. కాంతార గిరిజన తెగను అంతమొందించేందుకు భాంగ్రా యువరాజు కులశేఖర సిద్ధమవ్వడం, ఈశ్వర పూదోటలో విధ్వంసం సృష్టించడం, తన జాతిని కాపాడుకునేందుకు రిషబ్ చేసే యుద్ధం రుద్ర గులిగలా మారి చేసే రుద్ర తాండవం ప్రేక్షకుల్ని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. ప్రీ-క్లైమాక్స్ నుంచి శుభం కార్డు వరకు సాగే చిత్రమంతా మరో స్థాయిలో ఉంటుంది. చివరిగా ‘కాంతార 2’కి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది.
నటీనటులు
‘కాంతార చాప్టర్ 1’ పూర్తిగా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో. దర్శకుడిగా తను అల్లుకున్న కథ, తెరపై ఆవిష్కరించిన తీరు నటుడిగా ఆ కథకు ప్రాణం పోసిన విధానం… ప్రతిదీ అద్భుతం. ముఖ్యంగా రుద్ర గులిగ, ఈశ్వర గణం, చండిక రూపాల్లో తెరపై రిషబ్ చేసిన విన్యాసాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ఆయన ఈ సినిమాతో మరో జాతీయ అవార్డును ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్, భిన్న కోణాల్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన తీరు బాగుంది. జయరామ్ పాత్ర ఆరంభంలో మామూలుగా కనిపించినా, పతాక ఘట్టాలు వచ్చేసరికి విశ్వరూపం చూపించారు. ‘కాంతార’లో నవ్వులు పంచిన గ్యాంగ్‌ను దీంట్లోనూ అదే రీతిలో చూపించే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కవుట్ అయ్యింది.
సాంకేతికంగా
రిషబ్ తర్వాత ఈ సినిమాకి మరో హీరో అజనీష్ లోక్‌నాథ్ సంగీతం. ఆయన ఈ కథకు తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో ఆయన విశ్వరూపం చూపించేశారు. పాటలు కూడా కథలో భాగంగానే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కుదిరాయి. టైగర్ సీక్వెన్స్, అడవిలో కోతుల గుంపుతో చేసిన సీక్వెన్స్, దైవిక ఎఫెక్ట్స్ అన్నీ కనులవిందుగా ఉంటాయి. అరవింద్ ఎస్.కశ్యప్ ఛాయాగ్రహణం అడవి అందాల్ని అద్భుతంగా బంధించింది. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
రిషబ్ నటన, దర్శకత్వం
కథలోని దైవిక అంశాలు:.
యాక్షన్ ఘట్టాలు & నేపథ్య సంగీతం
బలహీనతలు
ప్రధమార్ధంలోని కొన్ని సన్నివేశాలు
ఊహలకందే ద్వితీయార్ధం
చివరిగా..
‘కాంతార చాప్టర్ 1’ దైవిక శక్తిని అనుభూతి చెందేలా చేసే ఒక విజువల్ వండర్! రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. భక్తి, పౌరాణిక, యాక్షన్ అంశాలు కలగలిసిన ఈ సినిమా ‘కాంతార’కు సరైన ప్రీక్వెల్‌గా నిలిచింది.
రేటింగ్: 3.5/5