ఇటీవల కన్నడంలో విడుదలైన ‘కాంతారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టిస్తున్నది. దక్షిణ కన్నడ గ్రామీణ వాతావరణాన్ని, సంస్కృతిని కళ్లకు కడుతూ అటవీ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి కథానాయకుడిగా నటిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ తెలుగు అనువాదం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. “కాంతారా’ అంటే సంస్కృతంలో అడవి అని అర్థం. ప్రేమను చూపిస్తే అంతకు మించిన ప్రేమను, విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని తిరిగి ఇవ్వడం అడవి తల్లి నైజం. ఈ అంశాన్ని చర్చిస్తూ ఎమోషనల్గా సాగే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్, సంగీతం: అజనీష్ లోకనాథ్, నిర్మాత: కిరగందూర్, దర్శకత్వం: రిషబ్ శెట్టి.