విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వెలువడ్డ నాటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ సోమవారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. కన్నడ స్టార్ దునియా విజయ్ ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర పోషించనున్నట్టు ఈ ప్రకటనలో వారు తెలియజేశారు.
బాలయ్య బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’లో పవర్ఫుల్ విలన్‌గా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సాధించారు దునియా విజయ్. ఇప్పుడు పూరీ, విజయ్ సేతుపతి సినిమా ద్వారా రెండోసారి తెలుగుతెరపై కనిపించబోతున్నారాయన.
ఇందులో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ అనిపించేలా అవుట్ స్టాండింగ్ అవతార్‌లో కనిపించబోతున్నారని, టబు కథలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని, దునియా విజయ్ భాగం అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కి మరింత బలం చేకూరినట్టయ్యిందని మేకర్స్ తెలిపారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని చార్మి కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.