కంగనారనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా రాజకీయపరంగా సున్నితమైన అంశాలను చర్చించారనే కారణంతో సెన్సార్ బోర్డ్ చిత్ర విడుదలను నిలిపివేసింది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకత్వం వహించింది.
ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది. సెన్సార్ సూచించిన పలు సన్నివేశాల తొలగింపునకు కంగనా రనౌత్ అంగీకరించడంతో సినిమా రిలీజ్‌కు రూట్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా రనౌత్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.
‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్ రావడం ఆనందంగా ఉందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ నిర్మించింది. నిర్మాణం నుంచే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ విడుదల బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.