ఫొటోలు, వీడియోల కోసం సోషల్మీడియా స్టార్ మోనాలిసాను కొందరు ఇబ్బంది పెట్టడం తనను ఎంతగానో బాధించిందని అంటున్నది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. అలాంటివారిని ద్వేషించడం తప్ప తానేం చేయలేనని చెప్పుకొచ్చింది. తాజాగా.. కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసా ఫొటోను ‘ఇన్స్టా’ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఇండస్ట్రీలో ‘డార్క్ స్కిన్’పై తన అభిప్రాయాలను పంచుకున్నది. ‘ఈ గ్లామర్ ప్రపంచంలో సహజసిద్ధమైన ముదురురంగులో ఉండే భారతీయ మహిళలకు ప్రాతినిధ్యం ఉందా? అను అగర్వాల్, కాజోల్, బిపాషా బసు, దీపికా పదుకొణె, రాణి ముఖర్జీని అభిమానించినట్టే.. ఇప్పటి యువ నటీమణులను కూడా అభిమానిస్తున్నారా?’ అంటూ సూటిగా ప్రశ్నించింది కంగనా.
ఇక మోనాలిసాలాంటి అమ్మాయిలు పరిశ్రమలో ఎంతోమంది ఉన్నారనీ, వారినీ ఇలాగే ఎందుకు గుర్తించడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యువ నటీనటులంతా తెల్లగా కనిపించడానికే ఆసక్తి చూపుతున్నారనీ, డస్కీగా ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదనీ చెప్పుకొచ్చింది. కొందరు నటీమణులు తెల్లగా కనిపించేందుకు లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే..స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.