Kamal- Rajinikanth | సౌత్ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ అత్యంత ప్రభావవంతమైన దిగ్గజ నటులు . వీరిద్దరినీ సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. 1985 వరకు వీరు కలిసి 15కి పైగా సినిమాల్లో నటించగా, ఆ తర్వాత మాత్రం కలిసి నటించింది లేదు. వారి కాంబోలో సినిమా రాక దాదాపు 46 ఏళ్లు అయింది. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ఈ వయస్సులోను చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
2020లో రజనీకాంత్, కమల్ కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ప్లాన్ చేయగా, అది కరోనా వలన ఆగింది. అయితే ఆ తర్వాత కమల్‌తో లోకేష్.. విక్రమ్ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ఇక ఇటీవల రజనీకాంత్‌తో కూలీ తీసాడు లోకేష్. 1979 లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత ఇద్దరు కలిసి నటించలేదు. 80 దశకం నుంచి స్టార్ డం అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ కాంబోని కలపడం ఎవరి వల్ల కాలేదు. లోకేష్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తారని ప్రచారం జరగగా, దీనిపై క్లారిటీ లేదు.
అయితే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయడం విశేషం . ఇప్పటి వరకు తమ మధ్య పోటీని జనం సృష్టించారు తప్ప రజినితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. త్వరలోనే ఇద్దరం చేతులు కలపబోతున్నామని అన్నారు. నిర్మాణ సంస్థ, దర్శకుడు లాంటి వివరాలేవీ చెప్పలేదు కానీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అర్ధమవుతుంది. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలని కూడా ప్రయత్నించాం అని కమల్ అన్నారు. కోలీవుడ్ టాక్ ప్రకారం దసరాకు ప్రకటన ఇచ్చి నవంబర్ లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ (కమల్ హాసన్) మరియు రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్) సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం