కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ ‘నాయకుడు’ వచ్చి అక్షరాలా 37ఏండ్లు. మళ్లీ ఇన్నాళ్లకు కమల్, మణిరత్నం కలిసి పనిచేస్తున్నారు అనగానే ‘థగ్‌లైఫ్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచానాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం పీరియాడిక్ డ్రామాను ఎంచుకున్నారు. అంతేకాదు, మణిరత్నం ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్ చేశారు.
ఇంత త్వరగా మణిరత్నం షూటింగ్ పూర్తి చేయడం ‘థగ్‌లైఫ్’ విషయంలోనే జరిగిందని కోలీవుడ్‌లో పలువురు అభిప్రాయపడుతున్నారు. త్రిష ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ ‘థగ్‌లైఫ్’ని విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సుహాసిని మణిరత్నం ఓ ఫొటోను తన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. ప్రతిష్టాత్మక నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను 150కోట్లకు సొంతం చేసుకున్నది. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం విదితమే.