Kamal Haasan | దక్షిణభారత సినిమా అభివృద్ధి, ప్రపంచ మార్కెట్‌పై దాని ప్రభావం.. అనే అంశంపై చర్చించేందుకు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వనటుడు కమల్‌హాసన్, త్రిష, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. ఫిల్మ్ మేకింగ్, డిజిటల్ ప్రవర్తన, కథ చెప్పడం, ఆధునిక యుగంలో వినోదం, వ్యాపార విధానాలు.. తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. చర్చాగోష్టి అనంతరం ఏర్పాటు చేసిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కమల్‌కి ప్రేక్షకుల నుంచి ప్రశ్నలెదురయ్యాయి.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘థగ్‌లైఫ్’ సినిమా గురించి ప్రశ్నించగా, ‘ఆ సినిమాలో రంగరాజ్ శక్తివేల్ నాయగర్ అనే గజదొంగ పాత్రలో నటించాను. మంచి, చెడు మిశ్రమం ఆ పాత్ర. అసలు రంగరాజ్ శక్తివేల్ ధృక్పథం ఏంటన్నదానిపైనే కథ అంతా ఆధారపడి ఉంటుంది.
ఇంతకంటే ఎక్కువ ఓపెనైతే మణిరత్నం నన్ను క్వశ్చన్ చేస్తాడు. అందుకే.. ఈ సమాధానాన్ని ఇక్కడితో ఎడిట్ చేస్తున్నా. ఈ ఎడిటింగ్ ప్రక్రియ కాస్త ఇబ్బందిగానే ఉంది.’ అంటూ చమత్కరించారు కమల్. లొకేషనంతా నవ్వులతో నిండిపోయాయి.