Rajinikanth | రజనీకాంత్ తాజాగా తన ‘దళపతి’నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్లో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన చెబుతూ.. “దళపతి’లో అమ్రీష్పురీ పాత్ర మెయిన్ విలన్. క్రూరుడైన రాజకీయనాయకుడిగా నటించారాయన. ఆయన కాంబినేషన్లో ఓ సన్నివేశం ఉంది. సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం అది. ఆ సీన్లో ఆయనతో నేను సవాల్ విసురుతా. మణిరత్నం ముందే చెప్పారు ‘ఈ సీన్ చాలా కీలకం.. మీరు ఎంత బాగా చేస్తే ఆ సీన్ అంతబాగా పండుతుంది’ అని. నేను కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నా. అయితే ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చేసినా మణిరత్నం మాత్రం తృప్తి పడటంలేదు.
లెక్కలేనన్ని టేకులు తీసుకున్నా. కానీ ఓకే మాత్రం అవ్వడంలేదు. చివరికి నాపై నేను నమ్మకం కోల్పోయే పరిస్థితికొచ్చా. ఏం చేయాలో అర్థం కాక, షూటింగ్‌కి కాస్త గ్యాప్ రాగానే నా మిత్రుడు కమల్‌హాసన్‌కి కాల్ చేసి, విషయం చెప్పా. తను నవ్వి.. ‘ఇలాంటిది జరుగుతుందని ముందే తెలుసు. ఓ పనిచెయ్.. ఆ సన్నివేశాన్ని మణిరత్నాన్ని నటించి చూపించమను.’ అని సలహా ఇచ్చారు. తను చెప్పింది పాటించా. వెంటనే సమస్య తీరిపోయింది. నేనేం చేస్తే దాన్నే ఓకే చేశారు.’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రజనీ. ఈ జ్ఞాపకంతో రజనీ, కమల్ల స్నేహం ఎంత బలమైందో మరోసారి అర్థమైంది.