‘ఒక నేనే.. నాకు చుట్టూ నేనే.. ఒకటైనా ఒంటరోడ్ని కానే.. స్వార్థము నేనే.. పరమార్థము నేనే..’ భగవద్గీతలో సారాన్నంతా ఒక్కలైన్లో చెప్పినట్టుందికదా సాహిత్యం! ‘కల్కి 2898’లో పాట ఇది. ‘భైరవ ఆంథమ్’ పేరుతో చిత్రబృందం సోమవారం ఈ పాటను విడుదల చేసింది. చిత్ర కథానాయకుడు ప్రభాస్, గాయకుడు దిల్జీత్ దోసాంజ్లపై చిత్రీకరించిన వీడియో కూడా అభిమానుల్ని ఆకట్టుకునేలావుందని చెప్పొచ్చు.
ఈ కథ మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం చివర్లో మొదలవుతుందని, అప్పట్నుంచి 2898వ సంవత్సరం దాకా సాగుతుందని తెలుస్తున్నది. ఈ క్రమంలో దశావతారంలోని చివరి అవతారమైన కల్కి ఆగమనం జరగడం, తర్వాత ఏం జరిగింది? అనేదే కథ అని సమాచారం. పురాణానికి, సైన్స్ ఫిక్షన్ని జోడించి హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారని చిత్రబృందం చెబుతున్నది. ఈ వెండితెర అద్భుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.