ప్రభుదేవా, కాజోల్ కాంబినేషన్ అనగానే ‘మెరుపు కలలు’ (1997) చిత్రంలోని ‘వెన్నెలవే వెన్నెలవే’ అనే పాట గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో యువతరాన్ని ఆమితంగా ఆకట్టుకుంది ఆ పాట. ‘మెరుపు కలలు’ సినిమా తర్వాత ప్రభుదేవా, కాజోల్ కలిసి నటించలేదు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అగ్ర తారలిద్దరూ ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళితే… తెలుగు యువకుడు చరణ్‌తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో కాజోల్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది.
యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నసీరుద్దీన్‌షా, జిషుసేన్ గుప్తా, సంయుక్త మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుదేవా-కాజోల్ జోడీ వెండితెరపై సందడి చేయబోతుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. కాజోల్ ప్రస్తుతం హిందీలో ‘మా’ అనే చిత్రంలో నటిస్తున్నది.