సినిమా : సత్యం సుందరం
తారాగణం: కార్తీ, అరవిందస్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్, దైవదర్శిని..
దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
ఆకాశమంత అంచనాలతో ఓ వైపు ‘దేవర’ విడుదలై వసూళ్ల సునామి సృష్టిస్తుంటే.. ఏ మాత్రం అంచనాలు లేకుండా కేవలం కాన్సెప్ట్నే నమ్ముకొని ‘దేవర’కు ఒక్కరోజు తేడాతో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘సత్యం సుందరం’. ‘96’ లాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన సి.ప్రేమ్‌కుమార్ ఈ సినిమా దర్శకుడు కావడం, కార్తీ, అరవిందస్వామి లాంటి మంచి నటులు ఇందులో నటించడంతో ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులకు ఆసక్తి అయితే పెరిగింది. దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్లో ‘దేవర’ మాస్‌ని మెప్పించే నిప్పులాంటి సినిమా అయితే.. మా ‘సత్యం సుందరం’ సిరిమల్లెపువ్వులాంటి సినిమా అన్నారు. మరి కార్తీ మాటను ఈ సినిమా నిజం చేసింది. సి.ప్రేమ్‌కుమార్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యిందా? ‘సత్యం సుందరం’ జనాన్ని మెప్పించే సినిమానేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవిందస్వామి).. మూలాలను, బంధాలను ప్రేమించే మనిషి. పుట్టింది, పెరిగింది గుంటూరు మంగళగిరికి దగ్గర్లో ఉన్న ఉద్దండరాయునిపాలెం. ఆ ఊరున్నా, తాను పెరిగిన ఇల్లాన్నా, ఆ గాలి అన్నా సత్యమూర్తికి ప్రాణం. తాను యుక్తవయసులో ఉన్నప్పుడే బంధువుల మోసం వల్ల సత్యం కుటుంబం ఇంటిని కోల్పోతుంది. ఇక ఆ ఊరులో ఉండలేక పెట్టేబేడా సర్దుకొని సత్యం కుటుంబం వైజాగ్ వెళ్లి స్థిరపడుతుంది. అక్కడే 30ఏండ్లు గడిచిపోతాయి. అన్నేండ్లు గడిచినా సొంతూరి జ్ఞాపకాలు మాత్రం సత్యాన్ని వదలవ్. ఓ రోజు సత్యం ఇంటికి పెళ్లి కబురు వస్తుంది. తన బాబాయి కూతురు పెళ్లి. ఉద్దండరాయునిపాలెంలో. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఊర్లో తనకి బాబాయి, ఆయన కూతురు తప్ప ఆత్మీయులెవరూ లేరనేది సత్యం భావన. అందుకే.. పెళ్లికి వెళ్లి ఒక్కరాత్రిలో తిరిగొచ్చేయాలనుకుంటాడు. గిఫ్ట్ తీసుకొని ఉద్దండరాయునిపాలెం వెళ్లి, కల్యాణమండపం కోసం వెతుకుతుండగా.. అతనికి ‘బావా..’ అని ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి(కార్తీ) తారసపడతాడు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతూ సత్యాన్ని పెళ్లి మండపానికి తీసుకెళ్తాడు. నిజానికి అతనెవరో, అతని పేరేంటో కూడా సత్యానికి తెలీదు. ఆ విషయం తెలిస్తే ఎక్కడ ఫీలవుతారో అని తాను కూడా మొహమాటం కొద్దీ తెలిసిన వాడిలా ప్రవర్తిస్తూ ఎలాగొలా మేనేజ్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి అతివాగుడు, మితిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం అతడ్ని నసగాడు, జిడ్డుగాడు అనుకుంటాడు. ఎలాగొలా వదిలించేసుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఒక్కరాత్రిలో వెళ్లిపోవాలనుకున్న వాడు కాస్తా.. అతని వల్లే ఇంకో రాత్రి, అతని ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. ఆ ఒక్కరాత్రిలో అతనేంటో సత్యానికి అర్థమవుతుంది. అతను ఓ తెల్లకాగితం లాంటి మనిషి అని తెలుసుకుంటాడు. ప్రేమను పంచడం తప్ప మరొకటి తెలీని గొప్ప మనిషి అని అర్థం చేసుకుంటాడు. మనుషుల్లోనే కాదు, జంతువుల్లో, విషసర్పాల్లోనూ మానవత్వాన్ని చూసే గొప్ప వ్యక్తిత్వం అతనిదని తెలుసుకుంటాడు. మరి వీరిద్దరి ప్రయాణం చివరికి ఏ మజిలికి చేరింది? తనెవరో తన పేరేంటో సత్యం ఎలా తెలుసుకున్నాడు? ఆ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగితా కథ.
విశ్లేషణ
తెరపై జీవితాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించిన సినిమా ఇది. ఎమోషన్స్‌తో కట్టి పడేశాడు దర్శకుడు ప్రేమ్‌కుమార్. సినిమా చూస్తున్నంతసేపు ప్రతిఒక్కరికీ స్వానుభవాలెన్నో గుర్తొస్తాయి. బాల్యం గుర్తొస్తుంది.. బంధువులు గుర్తొస్తారు. ఊర్లో ఆడుకున్న ఆటలు గుర్తొస్తాయి.. స్నేహితులు గుర్తొస్తారు. గడిచిపోయిన జీవితమంతా కంటిముందు మళ్లీ సాక్షాత్కరిస్తుంది. ఇందులో సత్యం ఫేస్ చేసిన అనుభవాలు ప్రతి ఒక్కరివీ. పసితనంలో ఏర్పడ్డ ఓ ముద్ర.. మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజెప్పే సినిమా ఇది. పరిస్థితులు.. బాద్యతలు.. బతుకు పోరాటం.. చుట్టూ ఉన్న ప్రపంచం.. ఇవి మనిషిలోని నిజాన్ని చంపేస్తాయి. అబద్ధంలో బతికేలా చేస్తాయి. మళ్లీ మన మూలలను మనం స్పృశించినప్పుడే మనమేంటో మనకు అవగతం అవుతుంది. అదే ‘సత్యం సుందరం’. ఈ కథ రీత్యా సత్యం.. సుందరం వేరు కాదు. ఒకరే. సత్యం తన ఊర్లో చిన్నతనంలో ఎంత సుందరంగా ఉండేవాడో.. సుందరం పాత్ర ద్వారా చూపించాడు దర్శకుడు. పశుపక్ష్యాదుల్ని ప్రేమించడం.. బంధాలను గౌరవించడం.. నేలను పూజించడం.. ఇంటిని అభిమానించడం.. ఇలాంటివన్నీ కలిస్తేనే సత్యం. ఆ సత్యం తన ఊరెళ్లి తన మూలాలను స్పృశించినప్పుడు సుందరంలో తనను తాను చూసుకున్నాడు. నిజంగా ఇంతగొప్పగా ఆలోచించిన దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ని నిజంగా అభినందించకుండా ఉండలేం. బోలెడన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాలు నింపుకున్న అందమైన ప్రయాణం ఈ సినిమా. తెరపై చాలాకాలం తర్వాత మనుషుల్ని చూసినట్టు అనిపించింది.
నటీనటులు
ఇక కార్తీ సుందరంలా జీవించాడు. నవ్వించాడు.. కన్నీరుపెట్టించాడు. తెరపై హీరోను చూస్తున్నట్టు లేదు. కేరక్టర్ మాత్రమే కనిపించంది. ఇలా అభినయించడం గొప్ప నటులకు మాత్రం సాధ్యం. ఇక అరవిందస్వామి కార్తీకి ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ తమకు తాము అద్దంలో చూసుకునేలా ఆయన అభినయం సాగింది. ఈ కథలో పెయిన్ అంతా ఓ విధంగా అరవిందస్వామి పాత్రదే. ఆ బాధను తెరపై అద్భుతంగా పండించాడు. మిగతా పాత్రలన్నీ తెరపై ప్రాణం పోసుకొని కనిపించాయి.
సాంకేతికంగా
దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ సృజన నుంచి పుట్టుకొచ్చిన అద్భుతకావ్యం ఈ సినిమా. ఎంతో అధ్యయనం చేస్తే తప్ప, జీవితాన్ని ఎంతో ప్రేమిస్తే తప్ప ఇలాంటి కథలు రాయలేం. రాసిన కథను ఇంత అద్భుతంగా చిత్రీకరించలేం. సరైన కథతో సరైన దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నేపథ్య సంగీతం, చాయాగ్రహణం అన్నీ బాగా కుదిరాయి. పాటల విషయంలో కాస్త శ్రద్ధ పెడితే బావుండేది. ఏది ఏమైనా.. ప్రేక్షకుల్ని రెండున్నర గంటలపాటు ఏదో ఒక ఎమోషన్‌తో కట్టిపడేసేదే నిజమైన కమర్షియల్ సినిమా. అలా చూసుకుంటే ‘సత్యం సుందరం’ అసలైన కమర్షియల్ సినిమా. సత్యం ఎప్పుడూ సుందరంగా ఉంటుంది.
బలాలు: కథ, కథనం, నటీనటుల నటన, దర్శకత్వం..
బలహీనతలు: పాటలు
రేటింగ్: 3.5/5