Jr NTR | ‘ఈరోజు మా అమ్మ కల నెరవేరింది. ఆమె కోరిక తీరింది. నన్ను కనీ ఇంత వాడ్ని చేసిన అమ్మ రుణాన్ని తీర్చుకోలేను కానీ.. ఏనాటినుంచో అడుగుతున్న అమ్మ చిన్న కోరికను మాత్రం తీర్చగలితాను. అందుకే చాలా ఆనందంగా ఉంది.’ అన్నారు జూనియర్ ఎన్టీఆర్. శనివారం ఆయన.. తన తల్లి షాలినీతో కలిసి ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా ఎన్టీఆర్‌తో కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను తారక్ తన ఎక్స్(ట్విటర్) ద్వారా పంచుకుంటూ..
‘మా అమ్మ సొంత ఊరు కర్ణాటకలోని కుందాపురా. అందుకే కుందాపురా వెళ్లి, ఆ తర్వాత ఉడిపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటూ ఉండేది. బిజీ వల్ల నాకేమో కుదిరేది కాదు. ఇన్నాళ్లకు అమ్మకోరిక తీర్చాను. సెప్టెంబర్ 2న మా అమ్మ పుట్టినరోజు. ఆ రోజుకు ముందు నేను అమ్మకు ఇచ్చే గొప్ప బహుమతి ఇదే.’ అంటూ ట్విటర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు తారక్. ఇంకా ఆయన కొనసాగిస్తూ.. ‘హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ సార్.. మీకు నా ధన్యవాదాలు. అలాగే ప్రియమిత్రులు రిషబ్‌శెట్టి, ప్రశాంత్‌నీల్ మాతోపాటు కలిసి వచ్చి, ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’ అంటూ ఎక్స్ వేదికగా ఫొటోలను పంచుకున్నారు తారక్. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.