Jr.Ntr Fan Shyam Passed Away | జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణం యావత్ టాలీవుడ్‌ను కలిచివేస్తుంది. సోమవారం రోజున శ్యామ్ తన గదిలో ఉరివేసుకుని మరణించినట్లు పోలిసులు తెలిపారు. శ్యామ్ మరణంపై కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఉరివేసుకునేంత పిరికివాడు కాదని, ఆయన మృతదేహంపై గాయాలనున్నాయని వెల్లడిస్తున్నారు. ఉరి వేసుకుని చనిపోయుంటే కాళ్లు నేలపై ఎలా ఆనించి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని గంటల నుంచి ట్విట్టర్లో #WewantjusticeforshyamNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు సైతం విచారణ వ్యక్తం చేస్తూ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కొరుతున్నారు. శ్యామ్ మరణంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు. ‘శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థుతుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుందని’ పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ కోరాడు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన దమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు జూ. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక స్టేజీపైకి వెళ్తున్న ఎన్టీఆర్‌ను బాడీగార్డులకు చిక్కకుండా వెనకనుంచి వచ్చి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలసి ఓ ఫోటో దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.