‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అలియాభట్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కుటుంబ సభ్యులతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఈ భామ ఎన్టీఆర్ కుమారులు అభయ్‌రామ్, భార్గవ్‌రామ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్ని పంపించి సర్ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ‘నువ్వు బహుమతిగా అందించిన డ్రెస్‌లు మా పిల్లలకు ఎంతగానో నచ్చాయి. వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. త్వరలోనే నాకు కూడా అలాంటి బహుమతి అందిస్తావనుకుంటున్నా’ అని ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. దీనిపై అలియాభట్ స్పందిస్తూ ‘తప్పకుండా నీకోసం ఈద్ స్పెషల్ డ్రెస్‌ను సిద్ధం చేస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది.