‘పట్టణ యువతలో నిజంగా జరుగుతున్న విషయాలను తెరపై చూపించాం. ఈ సినిమా విజయానికి కారణం అదే. నాగచైతన్య కూడా అదే మాట అన్నారు. ఎన్టీఆర్, బన్నీ కూడా సినిమా చూసి అభినందించారు. అన్నిటికంటే సంతోషం అనిపించిన విషయం ఏంటంటే.. మా అమ్మానాన్నకు సినిమాల గురించి పెద్దగా తెలీదు. కానీ ఊళ్లో వాళ్లంతా మా ఇంటికొచ్చి ‘మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు’ అని చెబుతుంటే వాళ్లు తెగ సంబరపడిపోతున్నారు.
పొద్దున్నే ఫోన్ చేసి ఆ ఆనందాన్ని నాతో పంచుకున్నారు.’ అంటూ దర్శకుడు అంజి కె.మణిపుత్ర ఆనందం వెలిబుచ్చారు. ఆయన దర్శకత్వంలో నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్ర ఆగస్ట్ 15న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని అంజి కె.మణిపుత్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో ముచ్చటించారు.
‘ఇందులోని పాత్రలన్నీ మా ఊర్లో నేను చూసినవే. వాటిని ప్రేరణగా తీసుకొని రాసుకున్నా. హీరోహీరోయిన్లు, ఫ్రెండ్స్.. ఇలా అన్ని పాత్రలూ చక్కగా కుదిరాయి. క్యాస్ట్ అనేది సెన్సిటీవ్ పాయింటే అయినా.. దాన్ని కామెడీగా డీల్ చేయడం వల్ల పెద్ద ఇబ్బంది రాలేదు. సీరియస్ పాయింట్ అయినా వినోదంతో చెబితే జనాలకు నచ్చుతుందని నా నమ్మకం. నా దగ్గర రెండు కథలున్నాయి. వాటి విషయంలో నేను అదే ఫాలో అవుతాను.’ అన్నారు అంజి కె.మణిపుత్ర.